భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన.. సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించిన సౌతాఫ్రికా

ABN , First Publish Date - 2021-12-07T02:17:14+05:30 IST

భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా నేడు సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. నిజానికి ఈ సిరీస్

భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన.. సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించిన సౌతాఫ్రికా

న్యూఢిల్లీ: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా నేడు సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. నిజానికి ఈ సిరీస్ ఈ నెల 17న ప్రారంభం కావాల్సి ఉండగా ఒమైక్రాన్ వైరియంట్ నేపథ్యంలో కొంత ఆలస్యంగా 26న ప్రారంభం అవుతుంది. అదే రోజున సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. జనవరి 3-7 మధ్య జొహన్నెస్‌బర్గ్‌లోని వాండడర్స్ స్టేడియంలో రెండో టెస్టు జరుగుతుంది. అదే నెల 11-15 మధ్య జరిగిన మూడో టెస్టుకు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియం వేదిక కానుంది. 


టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. అయితే ప్రస్తుతానికి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మాత్రం పక్కనపెట్టారు. దీనిపైనా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, ఇరు జట్ల మధ్య తొలి వన్డే జనవరి 19న పార్ల్‌లోని యూరోలక్స్ బోలాండ్ పార్క్‌లో జరగనుండగా, 21న జరగనున్న రెండో వన్డేకు కూడా అదే స్టేడియం వేదిక కానుంది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే జనవరి 23న కేప్‌టౌన్‌లోని సిక్స్ గన్‌గ్రిల్ న్యూలాండ్స్‌లో జరుగుతుంది.


ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ టెస్టు సిరీస్ జరగనుండగా, వన్డే సిరీస్‌ను ఐసీసీ పురుషుల ప్రపంచకప్ సూపర్ లీగ్‌‌లో భాగంగా నిర్వహిస్తున్నారు. 2023 పురుషుల ప్రపంచకప్ కప్‌కు ఇది క్వాలిఫికేషన్ టోర్నమెంట్.

Updated Date - 2021-12-07T02:17:14+05:30 IST