కాయ్‌ రాజా కాయ్‌...!

ABN , First Publish Date - 2021-10-26T03:16:44+05:30 IST

క్రికెట్‌ సీజన్‌ అనగానే జోరుగా బెట్టింగులకు తెరలేస్తోంది. నాలుగైదు సంవత్సరాలుగా జిల్లాలో క్రికెట్‌పై ఆన్‌లైన్‌ బెట్టింగులు కొనసాగుతున్నాయి. ఐపీఎల్‌, టీ-20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లే లక్ష్యంగా యువత ఆన్‌లైన్‌ బెట్టింగులు నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ అక్రమ దందా గుట్టుగా సాగుతోంది.

కాయ్‌ రాజా కాయ్‌...!

జిల్లాలో జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌

ఐపీఎల్‌, టీ-20 మ్యాచ్‌లే లక్ష్యం

పోలీసులు దాడులు జరుపుతున్నా ఆగని దందా

నిత్యం చేతులు మారుతున్న లక్షల రూపాయలు

మంచిర్యాల, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): క్రికెట్‌ సీజన్‌ అనగానే జోరుగా బెట్టింగులకు తెరలేస్తోంది. నాలుగైదు సంవత్సరాలుగా జిల్లాలో క్రికెట్‌పై ఆన్‌లైన్‌ బెట్టింగులు కొనసాగుతున్నాయి. ఐపీఎల్‌, టీ-20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లే లక్ష్యంగా యువత ఆన్‌లైన్‌ బెట్టింగులు నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ అక్రమ దందా గుట్టుగా సాగుతోంది. అంతకు ముందు ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేవలం నగరాలకే పరిమితం కాగా ప్రస్తుతం పల్లెలకు కూడా పాకింది. ఇటీవల జిల్లాలో పోలీసుల దాడుల్లో క్రికెట్‌ బెట్టింగ్‌రాయుళ్లు పట్టుబడటమే దీనికి నిదర్శనం. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌ మనీతో యువకులు బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐపీఎల్‌ క్రికెట్‌కు సంబంధించి గెలుపోటములపై బెట్టింగ్‌కు పాల్పడుతున్న 13 మంది ప్రధాన నిందితులను రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 2019మేలో అరెస్టు చేయడంతో జిల్లాలో బెట్టింగ్‌ దందా వెలుగుచూసింది. 10 రోజుల క్రితం లక్షెట్టిపేట పట్టణంలోని మార్కెట్‌ యార్డు ప్రాంతంలో ఢిల్లీ వర్సెస్‌ కోల్‌కతా మ్యాచ్‌ సందర్భంగా బెట్టింగ్‌ ఆడుతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. 

పలు చోట్ల బెట్టింగ్‌ కేంద్రాలు

జన్నారం, లక్షెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్‌తోపాటు పెద్దపల్లి జిల్లా  గోదావరిఖనిలో బెట్టింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల లక్షెట్టిపేట కేంద్రంపై పోలీసులు దాడులు చేయగా జన్నారంలోనూ పెద్ద ఎత్తున ఐపీఎల్‌ బెట్టింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం. మండలంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న బెట్టింగ్‌కు జిల్లా నలుమూలల నుంచి యువకులు తరలి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24న భారత్‌, పాకిస్తాన్‌ టీ-20 మ్యాచ్‌ సందర్భంగా కూడా జిల్లాలో పెద్ద ఎత్తున క్రికెట్‌ బెట్టింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. బుకీల సహకారంతో యువత ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ దందాను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే స్థానికంగా నిర్వాహకులు ఎవరూ లేకపోయినా, దూర ప్రాంతాలకు చెందిన బుకీలతో ఆన్‌లైన్‌లో సంప్రదింపులు జరుపుతూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. నిజామాబాద్‌, మహారాష్ట్రతోపాటు హెద్రాబాద్‌ కేంద్రంగా బుకీలు ఆన్‌లైన్‌ విధానంలో బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

కోడ్‌ భాష వినియోగిస్తూ

క్రికెట్‌ బెట్టింగ్‌లో భాగంగా పందేలు కాసేవారు బుకీల వద్ద కోడ్‌ భాష వినియోగిస్తూ రహస్యంగా బెట్టింగ్‌ ఆడుతున్నట్లు తెలుస్తోంది. బుకీల దగ్గర రిజిస్టర్‌ అయిన నెంబర్‌ నుంచి ఫోన్‌ రాగానే బెట్టింగ్‌ ప్రారంభిస్తారని సమాచారం. బెట్టింగ్‌ రాయుళ్లు వాడే భాషలో ‘లెగ్‌’ అనే పదం కీలకమైంది. ఎన్ని లెగ్గులు తీసుకుంటే లెక్క ప్రకారం అంత మొత్తం చెల్లించాలి. అలాగే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టుపై పందెం కాసేందుకు ‘ప్లేయింగ్‌’ అని, తక్కువ అవకాశాలున్న జట్టుపై పందెం కాసేందుకు ‘ఈటింగ్‌’ అనే పదాలను ఉపయోగిస్తారని సమాచారం. మ్యాచ్‌ జరిగే రోజున అప్పటికప్పుడే ఆన్‌లైన్‌ ద్వారా బెట్టింగ్‌ లావాదేవీలు జరుపుతారని పోలీసులు భావిస్తున్నారు.

బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు

ఐపీఎల్‌, టీ-20 వరల్డ్‌ కప్‌ జరుగుతున్నందున క్రికెట్‌ బెట్టింగులు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో పలు కేంద్రాల్లో బెట్టింగులకు పాల్పడుతున్న వ్యక్తుల్లో కొందరిని అరెస్టు చేశాం. చాలా మంది ఇండ్లలో కూర్చుని ఆన్‌లైన్‌ విధానంలో బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. మొదటిసారి పట్టుబడితే మరోసారి చేయకుండా కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. మరలా అదే తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్రికెట్‌ బెట్టింగ్‌ను నిరోధించేందుకు పోలీస్‌శాఖ తరుపున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం.

బార్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ 

నస్పూర్‌: పట్టణంలోని తెలంగాణ చౌరస్తా సమీపంలోని బిందు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఇండియా-పాకిస్తాన్‌ మధ్య ఆదివారం జరిగిన టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌ జరుగుతుందన్న సమాచారం అందడంతో ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ ఆధ్వర్యంలో సీఐ సంజీవ్‌, ఎస్సై శ్రీనివాస్‌లు  బెట్టింగ్‌ పాల్పడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.  వీరి వద్ద నుంచి రూ. 11వేల నగదు, నాలుగు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించి బెట్టింగ్‌ పై నిఘా ఏర్పాటు చేసి పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2021-10-26T03:16:44+05:30 IST