క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2021-06-14T05:51:28+05:30 IST

క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను పి.ఎం.పాలెం పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు
విలేకరుల విలేకరుల సమావేశంలో సీఐ రవికుమార్‌. పక్కన ఎస్‌ఐ శ్రీనివాస్‌

ఆధునిక సాంకేతిక పరికరాలు స్వాధీనం

పి.ఎం.పాలెం సీఐ రవికుమార్‌

కొమ్మాది (విశాఖ సిటీ), జూన్‌ 13: క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను పి.ఎం.పాలెం పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ రవికుమార్‌ ఆదివారం సాయంత్రం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు... రుషికొండ పనోరమ హిల్స్‌ సెలబ్రిటీ టవర్స్‌ 15వ అంతస్థు ఫ్లాట్‌ నంబర్‌-1 ఆధునిక సాంకేతిక పరికరాలతో గుట్టుగా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు పి.ఎం.పాలెం పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌లతో కలిసి దాడి చేశారు. అక్కయ్యపాలేనికి చెందిన కుంచంగి రవికుమార్‌, సుజాతనగర్‌కు చెందిన తమ్మారెడ్డి ధనుంజయ్‌, ఎంవీపీకాలనీకి చెందిన వీరపనేని రాంబాబు, విజయనగరానికి చెందిన శివాజీలను అదుపులోకి తీసుకున్నారు. విశాలాక్షినగర్‌కు చెందిన చేబోలు శ్రీనివాస్‌ అనే వ్యక్తి దీనిని నిర్వహిస్తున్నాడని, రవికుమార్‌, ధనుంజయ్‌, శివాజీలను ఉద్యోగులుగా నియమించుకున్నాడని విచారణలో తెలింది. శ్రీనివాస్‌కు స్నేహితుడైన రాంబాబు బెట్టింగ్‌ నిర్వహణ పనులు చూస్తుంటాడు. పాకిస్థాన్‌లో జరుగుతున్న పీఎస్‌ఎల్‌ టీ20 మ్యాచ్‌ల్లో భాగంగా శనివారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభమైన క్వెట్టా గ్లాడియేటర్స్‌, పెషావర్‌ జట్ల మ్యాచ్‌పై బెట్టింగులు నిర్వహిస్తునారు. ఈ సందర్భంగా బెట్టింగ్‌కు వినియోగిస్తున్న రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు టీవీలు, ఒక ట్యాబ్‌, మూడు మొబైల్స్‌, ఎన్‌ఎక్స్‌టీ డిజిటల్‌ సెట్‌ టాప్‌ బాక్స్‌, ఎయిర్‌టెల్‌ డంగ్లీ, రూటర్‌ విత్‌ కనెక్షన్‌, రూ.1,590 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన చేబోలు శ్రీనివాస్‌ పరారీలో ఉన్నాడు. విలేకరుల సమావేశంలో సీఐతోపాటు ఎస్‌ఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-06-14T05:51:28+05:30 IST