Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

క్రీ‘డల్‌’

twitter-iconwatsapp-iconfb-icon
క్రీడల్‌ రాజీవ్‌ క్రీడా మైదాన ప్రాంగణంలో క్రీడా పాఠశాల ఇదే

క్రీడాకారులకు ప్రోత్సాహం కరువు
జిల్లాలో ఉన్న ఒక్కగానొక్క పాఠశాల ఎత్తివేత
కానరాని క్రీడా వికాస కేంద్రాలు
117జీవో ద్వారా పీఈటీలకు నష్టం
నేడు జిల్లాకు రానున్న క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి రోజా


క్రీడలతోనే విద్యార్థి మానసిక.. శారీరక అభివృద్ధి ముడిపడి ఉంటుందని నిరంతరం వల్లెవేసే నేతలు, అధికారులు జిల్లాలో ఆవైపుగా తీసుకున్న చర్యలు అరకొరే. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించి శిక్షణ అందించేందుకు కనీస చొరవ తీసుకోవడం లేదు. జిల్లాలో ఉన్న ఒక్కగానొక్క క్రీడా పాఠశాలను ఎత్తేశారు. ఆరు చోట్ల క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి ఒకటే పూర్తి చేశారు. మిగతా చోట్ల నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలేశారు. జిల్లా పర్యటనకు ఆదివారం వస్తున్న క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి రోజా జిల్లాలో క్రీడాభివృద్ధికి కీలక నిర్ణయాలు ప్రకటించాలని ఆ రంగంలో ఉన్న వారంతా కోరుతున్నారు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో క్రీడాకారులకు కొదువ లేదు. వివిధ అంశాల్లో రాష్ట్ర.. జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న వారున్నారు. లేనిదల్లా నేతల చొరవ, అధికారుల ముందుచూపే. క్రీడల అభివృద్ధికి హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత విస్మరించడం రీవాజుగా మారింది. విద్యార్థి దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వారిని గుర్తించి తీర్చిదిద్దేందుకు విజయనగరం, కడప జిల్లాల్లో క్రీడా పాఠశాలలను గతంలో ఏర్పాటు చేశారు. జిల్లాలో విజ్జీ స్టేడియంలో ఈ పాఠశాల నడిచేది. వాటిలో చేరిన వారికి విద్యను అందిస్తూనే మరోవైపు వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ అందించేవారు. వందలాది మంది విద్యార్థులు ఆ పాఠశాలలో చేరి వివిధ క్రీడల్లో శిక్షణ పొందారు. చాలా మంది అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. కొన్నాళ్ల కిందట ఈ పాఠశాలను విజ్జీ స్టేడియం నుంచి రాజీవ్‌ క్రీడా మైదానానికి మార్పు చేశారు. జిల్లా క్రీడల అధికారి కార్యాలయం, రాజీవ్‌ క్రీడా మైదానం ఎదురెదురుగా ఉన్న కారణంగా పర్యవేక్షణకు వీలుంటుందని చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో కాని క్రీడా పాఠశాలను ఇటీవల ఎత్తివేశారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న వారిని ఉన్నఫలంగా కడపలో కొనసాగుతున్న క్రీడా పాఠశాలకు తరలించారు. అంతదూరం వెళ్లేందుకు ఆసక్తి లేని వారు ఇళ్లకు చేరుకున్నారు. ఇలా శిక్షణను మధ్యలో నిలిపేసి క్రీడాకారుల ఆసక్తిని మొక్కదశలోనే తుంచేసే పరిస్థితికి తీసుకువచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రీడా పాఠశాలను ఎత్తివేయటం బాధకరమని క్రీడాకారుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.


పూర్వ దశ వచ్చేనా?
పాఠశాలల్లో చదువుతూ క్రీడల పట్ల ఆస్తి ఉన్నవారిని తీర్చిదిద్దేందుకు వీలుగా అన్ని పాఠశాలల్లో  క్రీడా మైదానాల అభివృద్ధికి టీడీపీ ప్రభుతం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఉన్నత పాఠశాలల్లో విశాలమైన స్థలం ఉన్న చోట్ల అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించింది. ఈ పనులు జరుగుతుండగానే వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అంతే.. సంబంధిత అభివృద్ధి పనులను కొనసాగించాల్సిన ప్రభుత్వం వీటి గురించే పట్టించుకోలేదు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పనులు జరిగిన ప్రాంగణాలు కూడా సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో 220 ప్రభుత్వ పాఠశాలల్లో మైదానాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇవన్నీ ప్రస్తుతం రద్దు పద్దులోకి వెళ్లిపోయాయి.


జీవో117పై ఆందోళన
జీవో 117 క్రీడా రంగానికి నష్టం తెస్తోందని ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న పీఈటీలు, పీడీలు మండిపడుతున్నారు. ఈ జీవో ద్వారా ఉద్యోగులను కుదిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఉద్యోగ అవకాశాలు లేకుండా 117జీవో అడ్డంకులు సృష్టిస్తుందంటున్నారు.


పర్యాటకానికి అవకాశం ఉన్నా..
సముద్ర తీరం ఉన్న భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో బీచ్‌ల అభివృద్ధికి అపూర్వ అవకాశం ఉంది.  చింతపల్లి వద్ద కోట్లాది రూపాయలు వెచ్చించి గతంలో రిసార్ట్స్‌ నిర్మించారు. వీటిని ప్రారంభించేందుకు కూడా ఈ ప్రభుత్వం ఆసక్తి కనబర్చని పరిస్థితి ఉంది. అలాగే జిల్లాలో చారిత్రక ప్రదేశాలున్నాయి. గురజాడ గృహం, రాజుల కోటలతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాలు, విజయనగరంలోని పెద్దచెరువు, గంటస్తంభం, ఇతర చోట్ల  నదులు, తాటిపూడి జలాశయం వంటి ఎన్నో సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. వాటిని సంరక్షించి భవిష్యత్‌ తరాలకు అందించాల్సి ఉంది. ప్రభుత్వం కనీసం దృష్టి సారించడం లేదు. క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి రోజా జిల్లాకు వస్తున్న సందర్భంలోనైనా క్రీడలకు, పర్యాటకానికి దోహదపడే నిర్ణయాలు తీసుకోవాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.