అప్పు సగానికి సగం!

ABN , First Publish Date - 2022-05-26T08:06:05+05:30 IST

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అప్పులో సగానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే

అప్పు సగానికి సగం!

2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు

రూ.94 వేల కోట్లు తీసుకోదలచిన రాష్ట్రం

అందులో సగం అప్పునకే కేంద్రం అనుమతి

కొంత మేర అయినా పెంచుకునేందుకు

కేంద్రంతో రాజీ యత్నాలు సాగిస్తున్న రాష్ట్రం

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అప్పులో సగానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై వారంలోగా స్పష్టత వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పేచీ పెడుతుందోనన్న ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రూ.4,102 కోట్ల మూలధన వ్యయ అప్పుతో కలిపి మొత్తం రూ.59,632 కోట్ల రుణం తీసుకుంటామని ప్రతిపాదించింది. ఇవి కాకుండా వివిధ కార్పొరేషన్ల కోసం గ్యారెంటీ అప్పులను కూడా బడ్జెట్‌లో పొందుపరచింది. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలకు రూ.12,198.70 కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల కార్పొరేషన్లకు రూ.22,675.07 కోట్ల అప్పు తీసుకుంటామని ప్రతిపాదించింది. అంటే... బడ్జెట్‌ అప్పులు, గ్యారెంటీ అప్పులు కలిపి మొత్తం రూ.94,505.77 కోట్లు అవుతుంది. కానీ కేంద్రం మాత్రం.. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచే ఈ రెండు రకాల అప్పులనూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో లెక్కిస్తామంటోంది. ఈ రెండు అప్పుల పరిమితి ఎంత దాటితే.. అంత శాతం మేర 2022-23 ఆర్థిక సంవత్సరపు ప్రతిపాదిత బడ్జెట్‌ అప్పుల్లో కోతలు విధిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చి, తెలంగాణ 2022-23లో రూ.42,728 కోట్ల మేర అప్పు తీసుకోవచ్చని తెలియజేసింది. అంటే ప్రతిపాదిత అప్పులో దాదాపు సగానికి సగం. అదే జరిగితే రూ.51,777 కోట్ల లోటు ఏర్పడుతుంది. దాన్ని భర్తీ చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ప్రత్యామ్నాయ మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తున్నా.. ఇంత భారీ మొత్తంలో నిధులను సేకరించడం కష్టతరమేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే సాధ్యమైనంత ఎక్కువ అప్పు పరిమితిని సాధించడానికి కేంద్రంతో రాజీ యత్నాలను కొనసాగిస్తున్నారు. ఈమేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్‌ను కలిసి వచ్చారు. అన్ని రకాల లెక్కలు, సమీకరణాల అనంతరం ప్రాథమికంగా తేల్చిన రూ.42,728 కోట్ల అప్పునకే కేంద్రం పరిమితమవుతుందా లేక కొంత మేరకైనా పెంచుతుందా అనే మీమాంసలో రాష్ట్ర అధికారులున్నారు. ఒకవేళ కేంద్రం దానికే కట్టుబడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచడానికి కేంద్రం ఒప్పుకోకపోతే అప్పుల పద్దు ఘోరంగా క్షీణిస్తుందని.. ఫలితంగా బడ్జెట్‌ హామీలను నెరవేర్చడం కష్టమవుతుందని చెబుతున్నారు. 

కొంతైనా పెంచుకోవాలని..

కార్పొరేషన్ల పేర తీసుకునే గ్యారెంటీ అప్పులు రూ.34,873 కోట్లను పక్కన పెట్టి, బడ్జెట్‌లో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మేరకు పెట్టిన రూ.59,632 కోట్లను పరిగణలోకి తీసుకున్నా... రూ.16,904 కోట్ల లోటు ఉంటుంది. అందుకే.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కనీసం బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.59,632 కోట్ల అప్పు తీసుకోవడానికైనా అనుమతించాలని కేంద్రాన్ని కోరుతున్నారు.  గ్యారెంటీ అప్పులకు కూడా అనుమతించాలని.. వివిధ కార్పొరేషన్ల ప్రాజెక్టులు నిర్మాణ దశల్లో ఉన్నాయని, అవి పూర్తయిన తర్వాత కార్పొరేషన్లు ఆ అప్పులను తీర్చేస్తాయని భరోసా ఇస్తున్నారు. త్వరలోనే వాటికి రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం ఒనగూరనుందని వివరిస్తున్నారు. కానీ... కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటూ తేల్చలేదు. ఒకవేళ రాష్ట్ర అధికారుల వివరణలపై సంతృప్తి చెందితే మరో రూ.5000 నుంచి రూ.10 వేల కోట్ల మేర పరిమితిని పెంచే అవకాశం ఉండవచ్చని ఆశిస్తున్నారు.

Updated Date - 2022-05-26T08:06:05+05:30 IST