క్రెడిట్‌ కార్డును కవర్‌ నుంచి తీయకముందే కొల్లగొట్టారు!

ABN , First Publish Date - 2021-02-28T16:16:51+05:30 IST

కొరియర్‌లో వచ్చిన క్రెడిట్‌ కార్డును కవర్‌ నుంచి తీయకముందే..

క్రెడిట్‌ కార్డును కవర్‌ నుంచి తీయకముందే కొల్లగొట్టారు!

హైదరాబాద్‌ : కొరియర్‌లో వచ్చిన క్రెడిట్‌ కార్డును కవర్‌ నుంచి తీయకముందే సైబర్‌ నేరగాళ్లు ఆ కార్డు నుంచి రూ. 1.10 లక్షలను కొల్లగొట్టారు. బోయినపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి సాయితేజేశ్వరరెడ్డికి ఓ షాపింగ్‌ మాల్‌లో కలిసిన రిప్రజెంటేటివ్‌ ఎలాంటి చార్జీలు లేకుండా క్రెడిట్‌ కార్టు ఇస్తానంటే వివరాలందించాడు. కానీ సంస్థ ప్రతినిధులు డిస్పాచ్‌కు ముందు ఏడాదికి రూ. 2 వేలు సర్వీస్‌ చార్జ్‌ అని చెప్పారు. దాంతో తనకు క్రెడిట్‌ కార్డు వద్దన్నా, ఆర్‌బీఎల్‌ ప్రతినిధులు డిస్పాచ్‌ చేశారు. బాధితుడికి కొరియర్‌ ద్వారా ఫిబ్రవరి 2న క్రెడిట్‌ కార్డు అందింది. ఆ కార్డు వాడడం ఇష్టం లేని సాయితేజేశ్వరరెడ్డి దాన్ని తిరిగి బ్యాంకులో అప్పగించేందుకు కవర్‌ కూడా తీయకుండా ఉంచాడు. ఈనెల 24న బాధితుడికి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతూ ఆర్‌బీఎల్‌ ప్రతినిధులమని పరిచయం చేసుకున్నాడు.


సాయితేజేశ్వర రెడ్డికి హిందీ అర్థం కాకపోవడంతో ఫోన్‌ కట్‌ చేశాడు. వారు పలుమార్లు ఫోన్‌ చేసి సంప్రదించే ప్రయత్నం చేసినా స్పందించలేదు. ఫోన్ల తర్వాత క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 76,820, రూ.21,420, రూ.12,712 మూడు సార్లు షాపింగ్‌ చేసినట్లు మెసేజ్‌లు వచ్చాయి. ఆ మెసేజ్‌లు నిమిషాల వ్యవధిలో మాయమయ్యాయి. అయోమయానికి గురైన బాధితుడు ఆర్‌బీఎల్‌ బ్యాంకును సంప్రదించగా క్రెడిట్‌ కార్డుతో షాపింగ్‌ జరిగినట్లు నిర్ధారించారు. ఆ లావాదేవీలకు, తనకు ఎలాంటి సంబంధంలేదని బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసి, కార్డును బ్లాక్‌ చేయించాడు. బ్యాంకు వారు సరిగా స్పందించకపోవడంతో సైబర్‌ క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. సైబర్‌క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-28T16:16:51+05:30 IST