సృజనశీలే గొప్ప గురువు

ABN , First Publish Date - 2021-07-23T05:30:00+05:30 IST

బౌద్ధులకు వైశాఖ పున్నమి ఎంత ముఖ్యమైనదో ఆషాఢ పున్నమి కూడా అంతే ప్రధానం. ఆషాఢ

సృజనశీలే గొప్ప గురువు

రేపు ధర్మచక్ర ప్రవర్తన దినం


బౌద్ధులకు వైశాఖ పున్నమి ఎంత ముఖ్యమైనదో ఆషాఢ పున్నమి కూడా అంతే ప్రధానం. ఆషాఢ పున్నమిని ‘గురు పౌర్ణమి’గా, ‘ధర్మచక్ర ప్రవర్తన దినం’గా పాటిస్తారు. వైశాఖ పున్నమి రోజున బుద్ధ గయలో జ్ఞానోదయం పొందాక, తాను పొందిన జ్ఞానాన్ని ‘ముందుగా ఎవరికి తెలియజేయాలి?’ అని బుద్ధుడు ఆలోచించాడు. తన గురువులైన ఆలార కాలాముడు, ఉద్ధక రామపుత్రులకు చెప్పాలనుకున్నాడు. కానీ అప్పటికే వారు మరణించారని తెలుసుకున్నాడు. చాలాకాలం తనతోపాటు కలిసి తపస్సు చేసిన ముగ్గురు మిత్రులు ఆయనకు గుర్తుకు వచ్చారు.. శరీరాన్ని శ్రమకు గురి చేయడం వల్ల ముక్తి కానీ, జ్ఞానం కానీ రాదని బుద్ధుడు చెప్పడంతో... వారు ఆయనను ధ్యాన భ్రష్టుడుగా నిందించి వెళ్ళిపోయారు.


కాబట్టి... దుఃఖ నివారణ కోసం తాను కనుక్కున్న కొత్త మార్గాన్ని వారికే బోధించాలనుకున్నాడు బుద్ధుడు. వారు సారనాథ్‌లో ఉంటున్నారని విని, వారికోసం బయలుదేరాడు. రెండు నెలలకు సారనాథ్‌ చేరుకున్నాడు. తాను ఆవిష్కరించిన అష్టాంగ మార్గాన్ని వారికి వివరించాడు. అలా ఆ అయిదుగురూ బుద్ధుని ధర్మ మార్గంలోకి వచ్చిన మొదటివారుగా... పంచవర్గీయ భిక్షువులుగా బౌద్ధంలో ప్రసిద్ధి చెందారు. ఆ రోజును... ‘ధర్మచక్ర ప్రవర్తన దినం’గా, ‘గురు పున్నమి’గా ప్రపంచంలోని బౌద్ధులందరూ జరుపుకొంటారు. 




బుద్ధుడిని ‘సత్తాదేవ మనుస్సానం’ అంటారు. ‘సత్తా’  అంటే శాస్త (గురువు). ఎదుటివారి స్థాయిని బట్టి, వారికి ఎలా చెబితే అర్థం అవుతుందో ఆ విధంగా చెప్పగల నేర్పరి. అందుకే ఆయనను ‘మహా గురువు’గా వ్యవహరిస్తారు. బుద్ధుణ్ణి ‘బుద్ధా’ అని కాకుండా... ‘శాస్త’, ‘మహా శాస్త’ అని సంబోధించడమే బౌద్ధ సాహిత్యంలో అన్ని చోట్లా కనిపిస్తుంది.


గురువును శిష్యులు అయిదు రకాలుగా సేవించాలి. గురువు కనిపించగానే ... లేచి నిలబడి, నమస్కరించాలి. వారికి అవసరమైన పరిచర్యలు చేయాలి. వారి పట్ల మిక్కిలి శ్రద్ధ చూపించాలి. ఏదో మొక్కుబడిగా ప్రవర్తించకూడదు. గురువులు బోధించే విషయాలను నేర్చుకోవడమే కాదు... నేర్పే నైపుణ్యాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. నిరంతరం వారిని సేవించి, గౌరవించాలి. అలాగే గురువులు కూడా తమ శిష్యుల పట్ల అయిదు రకాలుగా ప్రవర్తించాలి. శిష్యులకు అన్ని విధాలుగానూ భద్రత కల్పించాలి. తమ సొంత బిడ్డల్లా చూసుకోవాలి. తమ దగ్గర ఉన్న విద్యలన్నిటినీ నేర్పి, మరిన్ని విద్యలు నేర్పడానికి తన మిత్రులకో, మరో మంచి గురువుకో అప్పగించాలి. తాను చెబుతున్న విషయాలను శిష్యులు గ్రహించారా? లేదా? అనేది తెలుసుకోవాలి. శిక్షణలో ఏమరపాటు చూపకూడదు.


ఇక, అన్నిటికీ మించి గురువు చేయాల్సిన గొప్ప పని ఏమిటంటే ‘ఆచార్య ముష్టి’ ఉంచుకోకూడదు. అంటే తనకు తెలిసినది ఎంతైనా... దానిలో కొంత భాగాన్ని తన గుప్పిటిలో దాచి పెట్టుకోకుండా... తన జ్ఞానం అంతటినీ శిష్యులకు బోధించాలి. ఈ అయిదిటితో పాటు గురువు సృజనశీలి అయి ఉండాలి. ఈ విషయాన్ని వివరించే బౌద్ధ కథ ఇది:


ఒక రాజు కొలువులో ఏనుగులకు శిక్షణ ఇచ్చే గొప్ప గురువు ఉండేవాడు. అతనికి రాజు తగిన వేతనం ఇచ్చి గౌరవించేవాడు. అతను శిక్షణ ఇచ్చిన ఏనుగు యుద్ధంలో వీరవిహారం చేసేది. రాజును రక్షించేది. ఇంకా ఇతర విన్యాసాలు ఎన్నో చేసేది. 


ఆ గురువు దగ్గర ఒక వ్యక్తి శిష్యునిగా చేరాడు. ఎలాంటి దాపరికాలూ లేకుండా తనకు తెలిసిన అన్ని విద్యలనూ గురువు అతనికి నేర్పి ‘నాయనా! ఇప్పుడు నువ్వు నాతో సమానం’ అన్నాడు.

శిష్యుడు గురువుకు నమస్కరించి, రాజు దగ్గరకు వెళ్ళి ‘‘రాజా! ఇప్పుడు నేను నా గురువుతో సమానం. నాకూ ఉద్యోగం ఇప్పించండి’’ అని అడిగాడు.

రాజు ‘‘సరే!’’ అని, ‘‘నీకు నీ గురువుకు ఇచ్చే జీతంలో సగం ఇస్తాను’’ అన్నాడు.

‘‘రాజా! ఇది అన్యాయం. నేను కూడా నా గురువుకు ఏమాత్రం తీసిపోను. కావాలంటే మా ఇద్దరినీ మీరే పరీక్షించండి’’ అని కోరాడు.

రాజు అంగీకరించి, గురువును పిలిచి, విషయం చెప్పాడు. ‘‘ఎల్లుండే మీ ఇద్దరి విద్యా పాటవ ప్రదర్శన’’ అన్నాడు.

గురువు ఆ రాత్రంతా ఆలోచించాడు. ‘నేను అతనికి మొత్తం నేర్పాను. కాబట్టి కొత్త రకం విద్యను నేనే ఆవిష్కరింపజేసుకోవాలి’ అనుకున్నాడు. ఆ రాత్రికి రాత్రి ‘విలోమ విద్య’ను రూపొందించుకున్నాడు. ఆ విద్యలో మరునాడు ఏనుగుకు శిక్షణ ఇచ్చాడు. కూర్చోమంటే నిలబడడం, ముందుకు వెళ్ళమంటే వెనక్కు వెళ్ళడం... ఇదీ ఆయన కొత్తగా సృజించిన విలోమ విద్య.

ఆ మరుసటి రోజు గురు శిష్యుల విద్యా ప్రదర్శన జరిగింది. గురువు చేతిలో శిష్యుడు ఓడిపోయాడు.

‘‘రాజా! నా శిష్యుడు నా అంతటి మేటి. నాకు సెలవు ఇప్పించండి. నా ఉద్యోగంలో నా శిష్యుణ్ణి నియమించండి’’ అన్నాడు గురువు. శిష్యుడు కన్నీరు మున్నీరై, గురువు పాదాల మీద పడ్డాడు. రాజు ఆ ఇద్దరినీ తన కొలువులో నియమించాడు.

బుద్ధుడు చెప్పిన ఈ సృజనశక్తి మీదనే చైనాలో మార్షల్‌ ఆర్ట్స్‌ అభివృద్ధి చెందాయి. అహింసాయుత స్వీయ రక్షణ పోరాటాలు ప్రపంచమంతటా విస్తరించాయి. 

బుద్ధుడు సృజనశక్తి కలిగిన మహా గురువు. గురుపున్నమి గురు శిష్య అనుబంధాలకు నెలవు.

 బొర్రా గోవర్ధన్‌


Updated Date - 2021-07-23T05:30:00+05:30 IST