Abn logo
Sep 23 2020 @ 00:00AM

ప్రతి వంటకూ సృష్టి..

Kaakateeya

పరోటాలూ, దోశలూ, ఎగ్‌ ఫ్రైడ్ర్‌ రైస్‌, వడలూ, ఇడ్లీలూ.. నోరూరించే ఇలాంటి ఎన్నో ఆహార పదార్థాలు అరచేతిలో ఇమిడిపోతాయి. కీ ఛెయిన్లకు డతాయి.రిఫ్రిజిరేటర్లకు అతుక్కుపోతాయి. నిజానికి ఇవన్నీ మీనియేచర్‌ ఫుడ్‌ ఐటమ్స్‌... చెన్నైకి చెందిన సుధా చంద్రనారాయణ్‌, ఆమె కుమార్తె నేహా వీటి సృష్టికర్తలు. విదేశాల్లో సైతం ఆదరణ పొందుతున్న వీరి కళ వెనుక ఉన్న కథేమిటంటే...


క్రాఫ్టింగ్‌ నా జీవితం. ఏదైనా కొత్తది సృష్టించకుండా నాకు ఒక్క రోజు కూడా గడవదు’’ అంటారు సుధా చంద్రనారాయణ్‌. బాల్యం నుంచి పెరుగుతూ వచ్చిన ఆ కళాభిరుచిని ఆమె వ్యాపారావకాశంగా మార్చుకున్నారు. దానికి ఆమె కుమార్తె నేహా కూడా తోడయ్యారు.

తమిళనాడులోని తిరుచ్చికి చెందిన యాభయ్యేళ్ళ సుధ కెమాస్ట్రీలో గ్రాడ్యుయేట్‌. పెయింటింగ్‌, మట్టితో చిన్న చిన్న బొమ్మలు తయారు చేయడం, హస్తకళలు ఆమెకు చిన్నప్పటి నుంచీ హాబీలు. ఒక వైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే తన అభిరుచిని ఆమె కొనసాగిస్తూ వచ్చారు.పదిహేనేళ్ళ కిందట ఆమె కుటుంబం ముంబాయిలో ఉంటున్నప్పుడు క్లే ఆర్ట్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. ఆ తరువాత మట్టితో నగలూ, పెద్ద పెద్ద పువ్వులూ, బోనోసాయ్‌ మొక్కలూ... ఇలా అనేక వస్తువులు తయారు చేసి ఇంట్లో అలంకరించేవారు. సన్నిహితులకు బహుమతిగా ఇచ్చేవారు. 2013లో ఆమె కుటుంబం చెన్నై వచ్చి స్థిరపడింది. ఆ తరువాత ఇంట్లోనే చిన్న వర్క్‌ షాప్‌ను సుధ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే మట్టితో వస్తువులు రూపొందించేవారు. అభిరుచి ఉన్న వారికి క్లే ఆర్ట్‌లో శిక్షణ ఇచ్చేవారు. అప్పటికి మీనియేచర్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ను మట్టితో చేసే ఆలోచనేదీ ఆమెకు లేదు. 


అది ఇంకా కళ్ల ముందు మెదులుతోంది

రెండేళ్ళ కిందట, నేహా పుట్టిన రోజుకు కొత్తగా ఉండే బహుమతి ఏదైనా ఇవ్వాలనుకున్నారు సుధ. బాగా ఆలోచించి, నేహాకు ఇష్టమైన దోశె మీనియేచర్‌ను మట్టితో తయారు చేసి ఇచ్చారు. ‘‘అప్పుడు నేహాలో కనిపించిన సంతోషం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదుల్తోంది. ఆ మీనియేచర్‌ను తన స్నేహితులకి ఆమె చూపించింది. వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్‌ అయ్యారు. మాకూ అలాంటివి కావాలని అడగడం మొదలెట్టారు’’ అని గుర్తు చేసుకున్నారు సుధ.


నేహా స్నేహితుల కోరిక మేరకు పానీ పూరీ, వడపావ్‌, పావ్‌ భాజీ, మ్యాగీ, బర్గర్లు, పిజ్జాలూ... ఇలా ఎన్నో ఆహార పదార్థాల మీనియేచర్లను ఆమె రూపొందించారు. వాటిలో కొన్నిటికి మ్యాగ్నెట్స్‌ అతికించీ, మరికొన్నిటిని కీ ఛెయిన్లకు బిగించి ఇచ్చారు. వాటికి స్పందన బాగా రావడంతో దీన్ని ఒక వ్యాపారావకాశంగా మలచుకుంటే బాగుంటుందని తల్లికి నేహా సూచించారు. అన్నీ సొంతంగానే...

‘‘అంతకుముందు ఎప్పుడూ నేను తయారు చేసిన వస్తువుల్ని అమ్మలేదు. కానీ ఇంజనీరింగ్‌ చదువుతున్న మా అమ్మాయి ప్రోత్సాహంతో ‘సిఎన్‌ఆర్ట్స్‌ మీనియేచర్స్‌’ పేరిట ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించాం. మా అమ్మాయి కూడా క్లే మోడలింగ్‌ త్వరగానే నేర్చుకుంది. తమిళనాడు, మహారాష్ట్రలతో పాటు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, గోవాల్లో కూడా మేము కొన్నాళ్ళు ఉన్నాం. ఉత్తరాది, దక్షిణాది ఆహార పదార్థాల గురించి మాకు మంచి అవగాహన ఉంది. సహజత్వం ఉట్టిపడేలా మట్టితో ఈ మీనియేచర్లు తయారు చేయడానికి అది ఉపయోగపడుతోంది’’ అంటారు సుధ.


‘‘అయితే ఇది అంత సులువైన పని కాదు. సరైన ఆకృతి, సున్నితత్వం, సహజమైన రంగులు ఉట్టిపడే రూపం... ఇలా ప్రతిదానికీ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. చాలాసార్లు విఫలమవుతూ ఉంటాం. అనుకున్నట్టు తయారయ్యే దాకా ప్రయత్నిస్తూనే ఉంటాం. మొదట ప్లేట్‌ లాంటి బేస్‌ తీసుకొని, దాని మీద కప్పులూ, గిన్నెల్లాంటివి తయారు చేస్తాం. వాటి మీద అమరేలా వంటకాలను మట్టితో వేర్వేరుగా రూపొందిస్తాం. సరైన ఆకారం వచ్చి, సహజంగా కనిపించేలా రంగులతో తీర్చిదిద్దాక వాటర్‌ రెసిస్టెన్స్‌ కోటింగ్‌ వేస్తాం. ట్రేకి వాటిని అతికిస్తాం. తరువాత ఎండబెడతాం. దీనికి ఎంతో ఓపిక, శ్రమ అవసరమవుతుంది’’ అని చెప్పారామె.వంటకాన్ని బట్టి ఈ మీనియేచర్లు మూడు నుంచీ పదకొండు అంగుళాల వరకూ ఉంటాయి. గాలిలో ఎండిన, పర్యావరణహితమైన మట్టినే వారు ఉపయోగిస్తారు. ‘‘ఈ మీనియేచర్లలో కూరగాయలూ, ధాన్యం గింజలూ, ఆఖరికి ఆవ గింజలను కూడా సొంతంగానే చేసుకుంటాం. ఈ కళకు పర్ఫెక్షన్‌ కీలకం. దానికి సమయం తీసుకుంటుంది. ఉదాహరణకు మసాలా దోశ తయారీకి ఒక రోజు పడుతుంది. ఉత్తరాది వారి భోజనం పళ్ళెంలో పదిహేను వరకూ పదార్థాలుంటాయి. వాటిని రూపొందించాలంటే, రోజూ ఆరు గంటలు పని చేస్తే, మూడు రోజులు పడుతుంది’’ అని చెప్పారు నేహ. వీటి ధరలు రూ. 400 నుంచి రూ.1500 వరకూ ఉంటాయి.విదేశాల నుంచీ ఆర్డర్లు

సిఎన్‌ఆర్ట్స్‌ మీనియేచర్స్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా సింగపూర్‌, అమెరికా, మలేసియా లాంటి దేశాల నుంచి కూడా ఆర్డర్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దక్షిణాది, ఉత్తరాది వంటకాలతో పాటు ఇటాలియన్‌, చైనీస్‌ వంటకాలు... ఇలా వివిధ రకాల్లో వందకు పైగా ఫుడ్‌ మీనియేచర్లను సుధ, నేహ తయారు చేస్తున్నారు. 


‘‘అమెరికా నుంచి ఈ మధ్య ఫ్రిజ్‌లకు అతికించుకొనే వంద దోశ మీనియేచర్లకు ఆర్డర్‌ వచ్చింది. గృహ ప్రవేశానికి వచ్చే అతిథులకు ఇవ్వడానికి ఒక భారతీయుడు వాటిని అడిగారు. మేం పంపిన ఉత్పత్తులను అభినందిస్తూ సందేశాలు వచ్చాయి’’ అన్నారు సుధ. ‘‘డిమాండ్‌ బాగానే ఉన్నా ప్రస్తుతానికి మేం చెయ్యగలిగిన మేరకు పరిమితంగానే ఆర్డర్లు తీసుకుంటున్నాం. అనుకోకుండా మొదలైన ఈ కొత్త ప్రయాణం ఆసక్తిగా ఉంది. ఈ కళలో మరింత పరిపూర్ణత సాధించడం, వేర్వేరు సంస్కృతులకు చెందిన వంటల మీనియేచర్ల తయారీలో ప్రయోగాలు చెయ్యడం... ప్రస్తుతానికి ఇదే మా లక్ష్యం.

ఆహారం ఎవరికైనా ఆనందం కలిగించే అంశం. దాని ప్రతిరూపాలను కళాత్మకంగా మలచడం, వాటిని అందుకున్నవారి సంతోషంలో భాగం కావడం మాకెంతో తృప్తినిస్తోంది’’ అంటున్నారీ తల్లీకూతుళ్ళు.అమెరికా నుంచి ఈ మధ్య ఫ్రిజ్‌లకు అతికించుకొనే వంద దోశ మీనియేచర్లకు ఆర్డర్‌ వచ్చింది. గృహ ప్రవేశానికి వచ్చే అతిథులకు ఇవ్వడానికి ఒక భారతీయుడు వాటిని అడిగారు. మేం పంపిన ఉత్పత్తులను అభినందిస్తూ సందేశాలు వచ్చాయి


Advertisement
Advertisement
Advertisement