పథకం పారినా..ధైర్యం చెదిరింది

ABN , First Publish Date - 2020-12-01T09:21:38+05:30 IST

నలుగురు యువకులు ముఠాగా ఏర్పడ్డారు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని పథకం వేశారు. ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌ తయారు చేశారు. బ్రిటన్‌కు చెందిన బహుళ జాతి సంస్థగా చెప్పుకొంటూ రిజిస్టర్‌ చేయించారు. ‘ముందు మీరు చేరండి.. 60 రోజుల పాటు ప్రతి రోజు 5 శాతం రిటర్న్‌ ఇస్తాం

పథకం పారినా..ధైర్యం చెదిరింది

నకిలీ కంపెనీ సృష్టించి రూ.7 కోట్లు వసూలు

ఊహించనంత డబ్బు రావడంతో బెంబేలు

పాలుపోక దందాకు అకస్మాత్తుగా తెర

మోసపోయిన ట్రాన్స్‌కో ఏఈ ఫిర్యాదు

విశాఖ యువకుల ఆటకట్టించిన పోలీసులు


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): నలుగురు యువకులు ముఠాగా ఏర్పడ్డారు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని పథకం వేశారు. ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌ తయారు చేశారు. బ్రిటన్‌కు చెందిన బహుళ జాతి సంస్థగా చెప్పుకొంటూ రిజిస్టర్‌ చేయించారు. ‘ముందు మీరు చేరండి.. 60 రోజుల పాటు ప్రతి రోజు 5 శాతం రిటర్న్‌ ఇస్తాం. ఇతరులను చేర్పించి డిపాజిట్‌ చేయిస్తే.. ఆ డబ్బుపై 10 శాతం కమీషన్‌ ఇస్తాం  ఎంతమందిని చేర్పిస్తే అంత కమీషన్‌’ అంటూ ఇంటర్‌నెట్‌లో ప్రకటన ఇచ్చారు. అత్యాశకు పోయి చాలామంది పెట్టుబడి పెట్టారు.


దీంతో ఆ యువకులకు రూ.7 కోట్లకుపైగా డిపాజిట్లు వచ్చాయి. ఇంకా ఇంకా వస్తుండటంతో రొటేషన్‌ చేసేందుకు భయపడిపోయి కంపెనీ, వెబ్‌సైట్‌ సెప్టెంబరులో మూసేశారు. తన పెట్టుబడికి రాబడి ఆగిపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన మణికొండకు చెందిన ట్రాన్స్‌కో ఏఈ సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకులను అరెస్టు చేశారు. వసూలు చేసిన డబ్బుతో వారు కొన్న రూ.58 లక్షల విలువైన స్థలం తాలూకు డాక్యుమెంట్లు, 2 కార్లు, 4 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.


నిందితుల విద్యార్హత ఇంటర్‌.. బాధితులు ఇంజనీర్లు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన నందకిషోర్‌, చిట్టంరెడ్డి ఆనంద్‌, భూమిరెడ్డి అవినాశ్‌, తుళ్లూరి శ్రీనివాసరావు ఇంటర్‌ చదివి ఖాళీగా తిరుగుతున్నారు. వీరిలో కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమా పూర్తి చేసిన అవినాశ్‌ జూలైలో ‘స్టెమ్‌కోర్‌ మాక్స్‌ హెడ్జ్‌’ పేరిట వెబ్‌సైట్‌ తయారు చేశారు. దాన్ని బహుళ జాతి కంపెనీగా డిపాజిటర్లను నమ్మించారు. ఇందులో రెండు నెలల్లోనే 2,500 మంది రిజిస్టర్‌ అయ్యారు. వారిలో ఎక్కువమంది ఉన్నత విద్యావంతులు, ఇంజనీర్లే. డీసీపీ (క్రైమ్‌) రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ బాలకృష్ణారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌కుమార్‌.. విశాఖ యువకుల ఆట కట్టించారు.

Updated Date - 2020-12-01T09:21:38+05:30 IST