పట్నంపైనే మోజు

ABN , First Publish Date - 2022-01-05T05:54:12+05:30 IST

ఫ్లోరైడ్‌ నీరు, ఉండేందుకు సరైన ఇల్లు కిరాయికి కూడా దొరక్క రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేసేందుకు అధికారులు జంకేవారు. ఉద్యోగం అనివార్యం కావడంతో హైదరాబాద్‌ నుంచే రాకపోకలు సాగించేవారు.

పట్నంపైనే మోజు
నల్లగొండ జిల్లా చింతపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఉపాధ్యాయుల వాహనం

అధికారులంతా నగరం నుంచే రాకపోకలు

 సరిహద్దుల్లోని ప్రజాప్రతినిధులు సైతం

కరోనా క్యారియర్స్‌గా మారుతున్న వైనం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): ఫ్లోరైడ్‌ నీరు, ఉండేందుకు సరైన ఇల్లు కిరాయికి కూడా దొరక్క రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేసేందుకు అధికారులు జంకేవారు. ఉద్యోగం అనివార్యం కావడంతో హైదరాబాద్‌ నుంచే రాకపోకలు సాగించేవారు. కాలక్రమంలో కృష్ణాజలాలు, జాతీయ రహదారులు, ఖరీదైన, విలాస నివాస గృహాలు నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేటలో అందుబాటులోకి వచ్చాయి. అయినా ఉద్యోగులు స్థానికంగా నివసించేందుకు ఇష్టపడటం లేదు. నగరానికి సమీపంగా ఉండటంతో భూముల ధరలు ఆకాశాన్నంటడం, లెక్కకు మించి డబ్బు చేతిలోకి రావడంతో హైదరాబాద్‌ పరిసర మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సైతం పట్నం నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఫలితంగా ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదు.   


యాదాద్రి, నల్లగొండ జిల్లా కలెక్టరేట్లలో పనిచేసే సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారుల్లో 70శాతం మంది హైదరాబాద్‌ నుంచే రాకపోకలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌కు యాదాద్రి జిల్లా 40కి.మీ దూరం, నల్లగొండ 100కి.మీ దూరంలో ఉండటం, ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో అధికారులకు అనుకూలంగా మారింది. పిల్లల ఉన్న త చదువులు, కుటుంబ సభ్యులకు సౌకర్యాల కారణంతో హైదరాబాద్‌లో నివాసం ఉండి రాకపోకలు సాగించేందుకే ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, కిందిస్థాయి పోలీస్‌ సిబ్బంది మాత్రమే పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఉద్యోగులు తప్పనిసరిగా పనిచేసే చోటే నివాసం ఉండాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా ఆచరించే వారే లేరు. ఉద్యోగులను స్థానికంగా ఉంచి పనిచేయించుకోవాలనే పట్టుదల కలెక్టర్లల్లో లోపించడంతో ఉద్యోగుల రాకపోకలు నిరంతరాయంగా సాగుతున్నాయి.


అన్ని శాఖల అధికారులదీ అదే దారి

నల్లగొండ మెడికల్‌ కళాశాల  ప్రిన్సిపాల్‌ సహా సుమారు 70మంది వైద్యులు హైదరాబాద్‌ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఓపీ సేవలు అందించాల్సి ఉండగా, వీరు ఉదయం 10గంటలకు విధులకు హాజరై 12గంటలకే బ్యాగులు సర్దుకుంటున్నారు. కలెక్టరేట్‌లో 72 విభాగాలు ఉండగా, అందులో 40 శాఖల ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం 10.30గంటలకు విధులకు హాజరుకావాల్సి ఉండగా, 11గంటలకు గానీ రావడం లేదు. సాయంత్రం 4గంటలకే ఇంటిబాట పడుతున్నారు. ఉన్నతాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలకు ప్రభుత్వమే వాహనం, డీజీల్‌, పెట్రోల్‌ సమకూరుస్తుండటంతో హైదరాబాద్‌ నుంచి వచ్చే అధికారులకు ఇది కలిసొచ్చే అంశంగా మారింది. వ్యక్తిగత వాహనాలను ప్రైవేటు వాహనాలుగా చూపుతూ బిల్లులు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి రాకపోకల కారణంగా ఎప్పుడు ఇంటిబాట పడదామనే ఆలోచనే తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ లోపిస్తోందని ప్రజాసంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. మల్లెపల్లి, మర్రిగూడ, నాంపల్లి, చిట్యాల వంటి మండలాల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైతం హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వీరి రాకపోకల కారణంగా కరోనా ప్రబలుతోంది.


యాదాద్రిలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు సైతం

నల్లగొండ జిల్లాతో పోలిస్తే యాదాద్రి జిల్లాకు చెందిన అధికారులు, కిం దిస్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. ఇక్కడ పనిచేసే ఏఎన్‌ఎంలు, అటెండర్లు సైతం నగరం నుంచే వచ్చిపోతున్నారు. వీరికి తోడు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం అక్కడి కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మహిళా సర్పంచ్‌లు ఎన్నికైన చోట వారి భర్తలే హైదరాబాద్‌ నుంచి గ్రామానికి వచ్చి పోతున్నారు. భూదాన్‌పోచంపల్లి వంటి మండలాల్లో 24 గంటలు ప్రసూతి సేవలు అందించే సౌకర్యం ఆస్పత్రుల్లో ఉంది. ఇద్దరు వైద్యాధికారులకు ఒక్కరే విధుల్లో ఉంటున్నారు. దీంతో నిరుపేదలకు సరైన వైద్య సేవలు అందడంలేదు. అధికారులు, కీలక ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లోనే ఉండటంతో అర్ధరాత్రి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలు వెతుక్కునే పరిస్థితి ఉంది. పోచంపల్లి, నారాయణపురం, చౌటుప్పల్‌, రాజాపేట, బొమ్మలరామారం, బీబీనగర్‌, భువనగిరి, తుర్కపల్లి మండలాలకు చెందిన సిబ్బంది మొత్తం నగరం నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. స్థానిక అధికారుల అలసత్వానికి బ్రేకలు వేయాలన్న ఆలోచనతో యాదాద్రి జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పథి రాత్రి 8గంటల వేళ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినా అధికారులో మార్పు రావడంలేదు.


ఆ అధికారులతో నష్టమే : నాగార్జున, కేవీపీఎస్‌ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్‌ నుంచి వచ్చిపోయే అధికారులతో నష్టమే. పలు పనులపై కార్యాలయాలకు వచ్చే ప్రజలు, బాధితులు విజ్ఞప్తులతో 11గంటల వరకు వేచిచూసి వెనక్కి తిరిగే పరిస్థితి జిల్లాలో ఉంది. అధికారులు వచ్చే వరకు వేచిచూసి విజ్ఞాపన పత్రాలు అందజేసినా వాటి పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నం శూన్యం. మా విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలవుతున్నాయి. ఈ విషయాన్ని నేరుగా కలెక్టర్‌ దృష్టికే తీసుకెళ్లా. ప్రభుత్వ ధనం వీరి వ్యక్తిగత ప్రయోజనాలకు ఖర్చవడం విచారకరం.


ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం : వి.చంద్రశేఖర్‌రావు, నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్‌

వ్యక్తిగత ఇబ్బందులున్నవారు హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే అంతా సకాలంలోనే విధులకు హాజరవుతున్నారు. స్థానికంగా నివాసం ఉండాలనే ప్రభు త్వ నిబంధన ఉంది. ఏ అధికారి అయినా అందుబాటులో ఉండటం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.


ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం

ఇద్దరు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థినులకు పాజిటివ్‌

హైదరాబాద్‌ నుంచి వచ్చిపోతున్న ఉపాధ్యాయుడికి తొలుత బయటపడిన వైరస్‌

చింతపల్లి, జనవరి 4: నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో కరోనా కలక లం రేపింది. ఇద్దరు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చింతపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు హైదరాబాద్‌లో నివసిస్తూ ప్రతిరోజూ కారులో విధులకు హాజరవుతున్నాడు. ఈ నెల 1, 2 తేదీలకు సెలవు కావటంతో జ్వరం, దగ్గుతో బాధపడుతున్న అతడు ఈ నెల 2వతేదీన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో తన శ్వాబ్‌ నమూనాను పరీక్షల నిమిత్తం ఇచ్చాడు. సోమవారం యథావిధిగా విధులకు హాజరుకాగా; కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందంటూ మధ్యాహ్న సమయంలో సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆ ఉపాఽధ్యాయుడు విషయాన్ని సహచర ఉపాధ్యాయులకు చెప్పి సెలవు పెట్టి వెం టనే కారులో ఇంటికి వెళ్లాడు. విషయాన్ని ఉపాధ్యాయులు డీఈవో భిక్షపతికి వి వరించగా, ఆయన ఆదేశాల మేరకు డాక్టర్‌ అలీం ఆధ్వర్యంలో వైద్య బృందం పాఠశాలలో మంగళవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. పాఠశాలలో 274 మంది విద్యార్థులు ఉండగా, 166మంది విద్యార్థులు, 23మంది ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, వంట సిబ్బంది హాజరయ్యారు. 189మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థినులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే ఉపాధ్యాయుడికి, విద్యార్థినులకు కరోనా కిట్లు అందజేసి హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. పాఠశాలకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు మంగళవా రం సెలవులో ఉం డగా, వీరిలో హెచ్‌ఎం కూడా ఉన్నారు. వైరల్‌ ఫీవర్‌ ఉందని ఈ నెల 3వ తేదీ నుంచి హెచ్‌ఎం సెలవులో ఉన్నట్లు తెలిసింది.

Updated Date - 2022-01-05T05:54:12+05:30 IST