Abn logo
Sep 25 2020 @ 05:36AM

అటకెక్కిన షిప్‌యార్డు విచారణ

Kaakateeya

50 రోజులైనా మృతుల కుటుంబాలకు అందని పరిహారం

కోర్టు తీర్పు ప్రకారం ఇస్తామంటూ కొత్తగా మెలిక?

బాధిత కుటుంబాల్లో వేదన

పట్టించుకోని జిల్లా యంత్రాంగం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

హిందుస్థాన్‌ షిప్‌యార్డులో క్రేన్‌ ప్రమాదం జరిగి 50 రోజులు దాటిపోయింది. ఆ ఘటనలో పది మంది చనిపోగా...వారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. అయితే ఇప్పటివరకు వారికి రూపాయి కూడా ఇవ్వలేదు. పోస్టుమార్టం నివేదికలు రాలేదని, కోర్టులో కేసు తేలాక, అక్కడ ఎంత చెబితే...అంత ఇస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో బాధిత కుటుంబాలు దిక్కుతోచక ‘మా బతుకులు ఎలా?’...అంటూ దీనంగా రోదిస్తున్నాయి. 


ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి స్టైరిన్‌ లీకై కొందరు చనిపోయినప్పుడు పది రోజుల్లోనే ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున పరిహారం ఇచ్చింది. అలాగే ఫార్మా సిటీలో ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా వారం, పది రోజుల్లోనే పరిహారం అందజేస్తుంటారు. కానీ షిప్‌యార్డులో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అసలు ప్రమాదానికి కారణం ఏమిటో షిప్‌యార్డు యాజమాన్యం ఇప్పటివరకు తేల్చలేదు. దీనిపై జిల్లా యంత్రాంగం నివేదిక సమర్పించి చేతులు దులుపుకుంది. ఆ తరువాత జరగాల్సిన వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. కార్మిక సంఘాలు కూడా దీనిపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం గమనార్హం.


ఒకేసారి పది మంది మృతి

ఆగస్టు ఒకటో తేదీన ఉదయం 11.45 గంటలకు షిప్‌యార్డులో క్రేన్‌ కూలిపోయి అక్కడికక్కడే పది మంది చనిపోయారు. ఆ క్రేన్‌కు సంబంధించి జిల్లా యంత్రాంగం విచారణ చేస్తే నిబంధనలకు అనుగుణంగా ఏ ఒక్కటీ చేయలేదని తేలింది. ఏడుగురు అధికారులతో నియమించిన కమిటీ పది రోజుల్లో నివేదిక సమర్పించింది. క్రేన్‌ డిజైన్‌లోనే లోపం లేదని ఆ కమిటీ తేల్చింది. ట్రయల్‌ రన్‌కు ముందు సంబంఽధిత ఏజెన్సీలతో సర్టిఫై చేయించాలని, అటువంటివేవీ కూడా చేయలేదని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించినట్టు తేల్చింది. అయితే దీనికి బాధ్యులు ఎవరు? ఎవరిపై చర్యలు తీసుకోవలసి వుందనే దానిపై మాత్రం అధికారులు ఎక్కడా ప్రస్తావించలేదు.


షిప్‌యార్డు విచారణ ఏదీ?

ఈ ప్రమాదంపై షిప్‌యార్డు యాజమాన్యం కూడా విచారణ చేయాలని శాఖాపరంగా లోపాలు, బాధ్యులు ఎవరో తేల్చాలని ప్రభుత్వం సూచించింది. నాటి సీఎండీ  తొందరపాటు వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఆయన ఆగస్టు నెలాఖరున రిటైర్‌ అవుతున్నందున ఆ సమయానికి క్రేన్‌ను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో స్థానిక ఏజెన్సీలతో పనులు చేయించారనే ఆరోపణలు వచ్చాయి. ఆయన పదవీ విరమణ చేసి కొత్త సీఎండీ వచ్చారు. ఆయన కూడా ఇక్కడ పనిచేసిన అధికారే. అయితే ఇప్పటివరకు నివేదిక వెల్లడించలేదు. ఎవరిపైనా చర్యలు చేపట్టలేదు. బాధితులకు పరిహారం ఇవ్వకుండా తిప్పుతున్నారు. పోస్టుమార్టం నివేదికలు రాలేదని చెబుతున్నారు.


బాధిత కుటుంబాలు సర్టిఫికెట్లు ఇస్తేనే పరిహారం ఇస్తామని అంటున్నారు. మరోవైపు కోర్టులో కేసు వుందని, అక్కడ పరిహారం ఎంత ఇమ్మంటే...అంత ఇస్తామని పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు, కంపెనీ తరపున రూ.35 లక్షలు, మొత్తం రూ.50 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీనిని బాధితులకు అందించేందుకు ఇటు జిల్లా యంత్రాంగం గానీ, అటు షిప్‌యార్డు యాజమాన్యం గానీ చొరవ చూపడం లేదు. ప్రమాదానికి కారుకులైన వారిపై చర్యలు లేవు. తక్షణమే ఈ కేసుకు తగిన పరిష్కారం చూపాలని బాధిత కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement