భారీగా పెరిగిన క్రాకర్స్ ధరలు...తగ్గిన అమ్మకాలు

ABN , First Publish Date - 2021-11-04T20:22:04+05:30 IST

దీపావళి పండగ అంటేనే వెలుగులు జిమ్మే పటాకుల పండగ. పండగరోజున పిల్లలు, పెద్దలు ఎంతో హడావిడిగా బాణా సంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది.

భారీగా పెరిగిన క్రాకర్స్ ధరలు...తగ్గిన అమ్మకాలు

హైదరాబాద్: దీపావళి పండగ అంటేనే వెలుగులు జిమ్మే పటాకుల పండగ. పండగరోజున పిల్లలు, పెద్దలు ఎంతో హడావిడిగా బాణా సంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళి రోజున సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ క్రాకర్స్ వెలుగులతో ప్రతి వీధి కళకళలాడుతుంది. బాణా సంచాకాల్చడానికి పిల్లలు, పెద్దలు పోటీ పడుతుంటారు. కానీ ఈ సారి దీపావళి పండగ సందర్భంగా క్రాకర్స్ ధరలు చూసి కొనుగోలు దారులు కంగు తింటున్నారు. ఒక పక్క బాణాసంచా కాల్చేవారి సంఖ్య తగ్గుతున్న నేపధ్యంలో తాజాగా వాటి ధరలు మరింతగా మండిపోతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే బాణా సంచా ధరలు రెట్టింపు పెరిగాయి. గత సంవత్సరం కాకర పువ్వొత్తుల ధర డజన్ ఉన్నప్యాక్ 25 రూపాయలు పలుకగా ఈ సారి మాత్రం 50 రూపాయలు పలికింది. చిచ్చుబుడ్డి ధరలు డజన్ డజన్ కు చిన్న సైజువి 100 రూపాయలు కాగా ఈసారి 150 రూపాయలు పలికింది. పెద్దవి డజన్ 400 రూపాయలు, భూ చక్రాలు ప్యాక్ ధర గత సంవత్సరం 200 రూపాయలు కాగా ఈ సారి 400 రూపాయలు పలికింది. 


అలాగే బాంబుల విషయానికి వస్తే సీమ టపాకాయల ప్యాక్ ధర గత సంవత్సరం 50 రూపాయలు ఉంటే సారి 100రూపాయలకు అమ్మకాలు చేశారు. ఇక థౌజండ్ వాలా, టు థౌజంట్ వాలా, టెన్ థౌజెంట్ వాల వంటివి ఒక్కోటి 500 నుంచి 1000 రూపాయలు పలికాయి. గత సంవత్సరంకంటే ఈ సారి కొన్ని రకాల ఐటమ్స్ ధరలు మూడురెట్టు పెరిగినట్టు వ్యపారులు చెబుతున్నాయి. అయితే బాణా సంచా అమ్మకాల విషయానికి వస్తే కంపెనీలను బట్టి కూడా ధరలు పలుకుతున్నాయి. దాదాపు అన్ని రకాల ఐటమ్స్ ప్యాక్ పై ఉన్నధరలకు, అమ్మాలకు సంబంధం ఉండడం లేదు. కొనుగోలు దారుల స్థోమతను బట్టి ధరలు వసూలు చేస్తున్నారు.


 ప్రభుత్వ రంగ సంస్ధ హాకా ఆధ్వర్యంలో అమ్మకాలు జరిగే స్టాళ్లలో అయితే కాస్త ధరలు ఓ మాదిరిగా వుంటే మార్కెట్లోని మిగిలిన వ్యాపారులు మాత్రం ఇష్టా రాజ్యంగా ధరలు పెంచి అమ్మకాలు చేశారు. ఇదేమని అడిగితే ధరలు పెరిగాయని చెబుతున్నారు. మొత్తంగా గత సంవత్సరం కంటే ఈ సారి ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నా, కొనుగోళ్లు మాత్రం 50శాతానికి పైగా తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ధరలు విపరీతంగా పెరగడం వల్ల క్రాకర్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య చాలా తక్కువగానే వుందని అంటున్నారు. 

Updated Date - 2021-11-04T20:22:04+05:30 IST