భాగ్యనగరంలో టపాసుల్లా పేలుతున్న ధరలు.. బెంబేలెత్తుతున్న జనం.. ఇలా చేయండి..!

ABN , First Publish Date - 2021-11-04T14:28:21+05:30 IST

భాగ్యనగరంలో టపాసుల ధరలు పేలిపోతున్నాయి. గతంతో పోల్చితే..

భాగ్యనగరంలో టపాసుల్లా పేలుతున్న ధరలు.. బెంబేలెత్తుతున్న జనం.. ఇలా చేయండి..!

  • ధరల రాకెట్‌ పైపైకి..!
  • 40 శాతం పెరుగుదల
  • తగ్గిన దుకాణాల సంఖ్య

హైదరాబాద్‌ సిటీ : భాగ్యనగరంలో టపాసుల ధరలు పేలిపోతున్నాయి. గతంతో పోల్చితే 30-40 శాతం ధరలు పెరగడంతో టపాసులు కొనేందుకు జనం బెంబేలెత్తుతున్నారు. హోల్‌సేల్‌ టపాసుల దుకాణాల్లో రెండు రోజుల నుంచే అమ్మకాలు పెరిగాయని చెబుతున్నారు. మూడేళ్లతో పోల్చితే నగరంలో బాణాసంచా దుకాణాల సంఖ్య కాస్త తగ్గిందని అధికారులు చెబుతున్నారు. రవాణాచార్జీలు భారీగా పెరగడంతో పాటు, కొవిడ్‌ నేపథ్యంలో శివకాశిలో బాణాసంచా తయారీ బాగా తగ్గిందని, అందుకే హోల్‌సేల్‌ మార్కెట్లో టపాసుల ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు.  


కొనుగోలుదారుల సందడి..

నగరంలో ఓపెన్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలు కొనుగోలుదారులతో బుధవారం సందడిగా మారాయి. సికింద్రాబాద్‌, బేగంబజార్‌, గుడిమల్కాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఖైరతాబాద్‌, బాచుపల్లి, కూకట్‌పల్లి, మలక్‌పేట, సనత్‌నగర్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలకు బుధవారం టపాసులు కొనేందుకు స్థానికులు భారీగా తరలిరావడంతో షాపుల వద్ద సందడి కనిపించింది. మిఠాయి షాపులు కూడా కిటకిటలాడాయి. 


ఫ్యాన్సీ టపాసులపై ఆసక్తి

భారీ శబ్దాలు వచ్చే టపాసుల కంటే ఫ్యాన్సీ ఐటమ్స్‌ చిచ్చు బుడ్లు, కలర్‌కోఠి, షాట్స్‌, మల్టీకలర్‌ ఫ్లవర్‌ పాట్స్‌ కొనేందుకు జనం ఆసక్తి చూపించారు. భూ చక్రాలు, విష్ణుచక్రాలు, కాకరపువ్వత్తులతోపాటు మతాబులపై ఎక్కువగా ఆసక్తి కనబరిచారు.


రేట్లు మండిపోతున్నాయి  

టపాసుల రేట్లు భారీగా పెరిగాయి. గతంలో రూ.2 వేలకు వచ్చే టపాసులు ఇప్పుడు నాలుగువేలు పెట్టాల్సి వస్తోంది. గత సంవత్సరం కరోనాతో టపాసులు కాల్చకుండా పిల్లలను దూరంగా పెట్టాం. ఈ సంవత్సరం దీపావళికి తప్పకుండా పిల్లలకోసం టపాసులు కొనాల్సిన పరిస్థితి వచ్చింది. - మోహన్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి


30 శాతం పెరిగాయి 

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి హోల్‌సేల్‌ మార్కెట్‌లో టపాసుల ధరలు 30 శాతం పెరిగాయి. రెండేళ్లుగా దీపావళికి వ్యాపారం అంతగా లేకపోవడం కూడా ధరలు పెరిగేందుకు ఒక కారణంగా చెప్పవచ్చు. - విజయ్‌, హోల్‌సేల్‌వ్యాపారి, యూసుఫ్‌గూడ.


ఇలా చేయండి.. 

- కొనుగోలు చేసి తెచ్చిన బాణసంచాను   సురక్షిత ప్రాంతంలో నిల్వ ఉంచాలి. 

- కంటికి గాయమైతే పంపునీళ్లతో పది నిమిషాల పాటు  శుభ్రపర్చాలి

- కళ్లకు తీవ్రంగా గాయాలు అయితే వెంటనే కంటి వైద్యుడి వద్దకు వెళ్లాలి.

- క్రాకర్స్‌ను వెలిగించేందుకు పొడవైన కొవ్వొత్తి వాడాలి. 

- పోలీసుల అనుమతి పొందిన విక్రయదారుల నుంచే టపాసులు కొనుగోలు చేయాలి. 

- బకెట్‌లలో నీళ్లు నింపుకుని ఉంచడమే కాకుండా ఇసుకను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. 

- టపాసులను గ్యాస్‌ సిలిండర్‌, ఇంధనం వంటి వాటికి దూరంగా ఉంచాలి.

- క్రాకర్స్‌ను పేల్చే సమయంలో కేవలం కాటన్‌దుస్తులను ధరించాలి. 

- ప్రాథమిక చికిత్సకు అవసరమయ్యే ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌ సిద్ధంగా ఉంచుకోవాలి. 

-  ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నెంబర్లు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. 


ఇవీ చేయకూడదు.. 

- టపాసులను చేతిలోపెట్టుకుని కాల్చవద్దు.

- టపాసులను కాల్చేసమయంలో దగ్గరనుంచి చూడవద్దు.  

- టపాసులు పట్టుకున్న చేతితో కళ్లను తాకవద్దు.  

- టపాసులను బాటిల్స్‌, డబ్బాలో పెట్టి కాల్చవద్దు.

- ఒకేసారి అందరూ టపాసులు కాల్చొద్దు. ఒకే టపాసు ను ఇద్దరు, ముగ్గురు ఒకేసారి కాల్చొద్దు. 


పర్యావరణహిత టపాసులే కాల్చండి..

దీపావళి పర్వదినం సందర్భంగా పర్యావరణహిత టపాసులు మాత్రమే కాల్చాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భారీ శబ్దాలు, పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే టపాసుల తయారీ, సరఫరా, విక్రయాలు నిషేధమని పేర్కొన్నారు. డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రీన్‌ క్రాకర్స్‌ కాకుండా ఇతర రకాల టపాసులు విక్రయించే వారికి జరిమానా, కేసుల నమోదు వంటి చర్య లు తీసుకుంటారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టపాసు లు విక్రయిస్తే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారమివ్వాలని కోరారు.

Updated Date - 2021-11-04T14:28:21+05:30 IST