సీపీఎస్‌ రద్దు హామీకి ఏడాది

ABN , First Publish Date - 2020-05-31T09:33:46+05:30 IST

అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారు... పిల్లలను స్కూళ్లకు పంపే ప్రతి తల్లికి

సీపీఎస్‌ రద్దు హామీకి ఏడాది

- కొందరు తల్లులకే అమ్మఒడి లబ్ధి

- జగన్‌ ఏడాది పాలనపై నిరసనలు 

అనంతపురం విద్య, మే 30 : అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారు... పిల్లలను స్కూళ్లకు పంపే ప్రతి తల్లికి అమ్మఒడి సొమ్ము అందిస్తామన్నారు. అయితే అన్నీ ఆశలుగానే మిగిలాయి. కమిటీలతో కాలయాపన తప్పా ఏడాది గడిచినా సీపీఎస్‌ రద్దు కాలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనపై సంబరాలు చేసుకుంటుంటే... సీపీఎస్‌ ఉద్యోగులు అదే రోజైన శనివారం ఇళ్లలో సామూహిక నిరసనలకు దిగారు. మరోవైపు అమ్మఒడి అందక నేటికీ వేలాది మంది తల్లులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 


కొందరు అమ్మలకే న్యాయం... 

వైసీపీ అధికారంలోకి రావడానికి ముందు పిల్లలను స్కూళ్లకు పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు అమ్మఒడి సాయం అందిస్తామని ప్రకటించారు. అయితే అది నమ్మిన అమ్మల్లో కొందరికే న్యాయం జరుగుతుందని... మిగిలిన వారికి మొండి చేతులేనని నమ్మలేకపోయారు. జిల్లావ్యాప్తంగా 1-12 వ తరగతి వరకు అమ్మఒడి వెబ్‌సైట్‌లో 6,88,687 మంది విద్యార్థుల వివరాలు నమోదు చేశారు. ఆఖరికి కేవలం 3,62,579 మంది తల్లులకు మాత్రమే అమ్మఒడి డబ్బు జమ చేశారు. సాకులు చూపుతూ అనర్హులుగా ప్రకటించడంతో వేలాది మందికి నిరాశే ఎదురైంది. రెండో విడత నగదు జమ చేస్తామని మాయ చేశారు.


వారం చెప్పి... ఏడాది గడిచినా ఫలితం లేదు 

‘కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు చేస్తాం. పాత పెన్షన్‌ స్కీంను పునరుద్ధరిస్తాం’ అని వైసీపీ మేనిఫెస్టో-2019లో స్పష్టంగా పేర్కొంది. అధికారంలోకి వచ్చాక వారంలోనే రద్దుచేస్తామని ప్రగల్బాలు పలికారు. జిల్లావ్యాప్తంగా సీపీఎస్‌ బాధితులు సుమారు 15 వేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉన్నారు. అయితే ఏడాది గడిచినా సీపీఎస్‌ రద్దు చేయలేదు. దీనికి కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు. దీంతో సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సాంకేతిక సభ్యులు, ఎస్‌టీఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రేమ్‌నాథ్‌రెడ్డి, సీపీఎస్‌ బాధితులు శనివారం భారీగా ధర్నాలు చేశారు. జిల్లాలో 500 కుటుంబాలు సీఎం మాట తప్పడాన్ని ఖండిస్తూ ఇళ్లలోనే నిరసనలు తెలిపారు. సీపీఎస్‌ రద్దు చేస్తామన్న మాట   నమ్మాలంటే... రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానంలో పెన్షన్‌ ఇస్తే భరోసా పెరుగుతుందని నాయకులు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-05-31T09:33:46+05:30 IST