Jul 6 2021 @ 17:07PM

హీరో సూర్యకు సీపీఎం మద్దతు

నీట్‌ పరీక్షల వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతోందని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం సెన్సార్‌ చట్టాన్ని సవరించడం వల్ల సినీ రంగం నష్టపోతుందంటూ విమర్శించిన ప్రముఖ నటుడు సూర్యకు సీపీఎం మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా సూర్యను బీజేపీ నేతలు బెదిరింపు ధోరణులతో విమర్శించడం గర్హనీయమని సీపీఎం నేత కె.బాలకృష్ణన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్‌లో ఓ ప్రకటన చేశారు. సూర్యపై బీజేపీ నేతలు విమర్శించడం భావ స్వాతంత్ర్యానికి భంగం కలిగించడమే అవుతుందని ఆయన తెలిపారు.


సూర్యకు బెదిరింపులు తగదు బీజేపీకి డీవైఎఫ్‌ఐ హితవు

‘నీట్‌’తో రాష్ట్ర విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలిపిన నటుడు సూర్యను బెదిరించేలా బీజేపీ యువజన విభాగం సమావేశంలో తీర్మానం చేయడాన్ని డీవైఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌. రెజీష్‌ కుమార్‌, ఎస్‌. బాల విడుదల చేసిన ప్రకటనలో, వైద్యకోర్సుల్లో జాతీయ స్థాయి ‘నీట్‌’తో పేద విద్యార్థులు వైద్యులు కావాలనే ఆశలు అడియాశలవుతున్నాయన్నారు. ప్లస్‌ టూలో మంచి మార్కులు సాధించి నీట్‌లో ర్యాంక్‌ రాకపోవడంతో మనస్తాపం చెందిన అనిత సహా 17 రాష్ట్ర విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. నీట్‌ పరీక్షతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు తెలుసుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఏకే రాజన్‌ కమిటీ ఏర్పాటు చేసిందని, దీనిపై బీజేపీ న్యాయ స్థానానికి వెళ్లడాన్ని ఖండిస్తున్నామన్నారు.