సీతారాం ఏచూరి పేరుతో నకిలీ పోస్టులు.. కేసు నమోదు..

ABN , First Publish Date - 2020-08-09T05:00:51+05:30 IST

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేరుతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న..

సీతారాం ఏచూరి పేరుతో నకిలీ పోస్టులు.. కేసు నమోదు..

కోల్‌కతా: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ నకిలీ పోస్టుపై ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. ఓ వెబ్‌సైట్ వాటర్ మార్కుతో ఏచూరి ఫోటోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు సూర్యకాంత మిశ్రా కోల్‌కతా సైబర్ క్రైం సెల్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ‘‘మా పార్టీ జనరల్ సెక్రటరీ పేరుతో సదరు ఇమేజిలో మత కలహాలు పుట్టించే విధంగా హానికర సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ సోషల్ మీడియా పేజివాళ్లకు ఓ వెబ్‌సైట్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో రకరకాల తప్పుడు సమాచారం ఉంది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరాం..’’ అని మిశ్రా పేర్కొన్నారు. తన ఫిర్యాదుతో పాటు ఏచూరి పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ లింకును కూడా పోలీసులకు అందజేశారు. కాగా సీపీఎం నేతల నుంచి తమకు ఫిర్యాదు అందిందనీ.. దీనిపై విచారణ చేపడతామని కోల్‌కతా పోలీసులు నిర్ధారించారు. 

Updated Date - 2020-08-09T05:00:51+05:30 IST