పెట్రోల్ బంకు వద్ద నిరసన తెలుపుతున్న వామపక్షాలు
వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన
కావలిటౌన్, మే 24: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఏరియా వైద్యశాల నుంచి పెట్రోల్ బంకుల వరకు ప్రదర్శన నిర్వహించి అక్కడ నిరసన తెలిపారు. నేతలు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రెండు మూడింతలు పెరిగాయన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా అప్పుడున్న పెట్రోల్ ధర లీటర్ రూ.40, గ్యాస్ సిలిండర్ రూ.300 ఎక్కువని తాము అధికారంలో వస్తె తగ్గిస్తామన్న హామీ తుంగలో తొక్కడమే కాక పెట్రోల్, డీజిల్, ధరలు రెండింతలు, గ్యాస్ ధర మూడింతలు పెరిగాయని ఎద్దేవా చేశారు. అంబానీ, అదానీలకు వేల కోట్లు రాయితీలు ఇచ్చే ప్రభుత్వం పేద ప్రజలకిచ్చే గ్యాస్‌పై ఇవ్వకపోవడం విడ్డూరమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యం, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పి పెంచలయ్య, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ నేతలు కరవది భాస్కర్, లక్ష్మీరెడ్డి, మధుసూదన్, సీఐటీయూ నాయకుడు కృష్ణమోహన్, వై రవి తదితరులు పాల్గొన్నారు.