పెంచిన బస్సు చార్జీలు ఉపసంహరించాలి

ABN , First Publish Date - 2022-07-03T07:04:24+05:30 IST

పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. శనివారం స్థానిక కొత్తబస్‌స్టాండ్‌ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

పెంచిన బస్సు చార్జీలు ఉపసంహరించాలి
ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద సీపీఎం నాయకుల ధర్నా

ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద సీపీఎం నాయకుల ధర్నా

భీమవరం అర్బన్‌, జూలై 2: పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. శనివారం స్థానిక కొత్తబస్‌స్టాండ్‌ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పార్వర్డ్‌బ్లాక్‌ జిల్లా కార్యదర్శి లంకా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచి రెండు నెలలు గడవక ముందే మరోసారి ప్రజలపై భారాన్ని మోపిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ నిత్యావసరాల ధరలు రోజురోజుకి పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. వెంటనే ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

నరసాపురం టౌన్‌, జూలై 2 :వైసీపీ అఽధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మూడుసార్లు బస్సు చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు ఆరోపించారు. చార్జీల పెం పును నిరశిస్తూ శనివారం ఆర్టీసీ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. పెంచిన చార్జీలను తక్షణం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం నాయకులు పొన్నాడ రాము, నోమలు కొండ, ఇజ్రాయేలు, చింతపల్లి గంగయ్య పాల్గొన్నారు. 

ఉండి, జూలై 2: పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జేఎన్‌వీ గోపాలన్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఉండి ఆర్టీసీ బస్టాండ్‌లో సీపీఎం మండల కార్యదర్శి ధనికొండ శ్రీను ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. చీర్ల శేషు, మల్లువలస ఈశ్వరరావు, కలిదిండి సూర్యనారాయణరాజు, వెంకన్న, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T07:04:24+05:30 IST