ఈడ్చి.. ఈడ్చి.. కొడతా

ABN , First Publish Date - 2022-07-02T06:13:31+05:30 IST

‘రేయ్‌.. ఎవడ్రా మీరు.. నాపైనే కంప్లైంట్‌ చేస్తారా? అస్సలు నాపై కంప్లైంట్‌ చేసినోడు ఎవడు? వాడెవడో చెబితే ఈడ్చి ఈడ్చి తంతా..’ అంటూ ఓ మట్టిమాఫియా అధికారులు, అడ్డొచ్చిన వారిపై రెచ్చిపోయింది. అనుమతి లేకుండా చెరువులో దర్జాగా మట్టిని తవ్వుకుంటూ సొమ్ము చేసుకుంటున్న ఓ వ్యక్తి అధికారితో పాటు దళితులపై నోటికొచ్చినట్లు మాట్లాడిన సంఘటన బత్తలపల్లి మండలంలోని మాల్యవంతం గ్రామంలో చోటు చేసుకుంది.

ఈడ్చి.. ఈడ్చి.. కొడతా

ఎవడ్రా.. నాపై కంప్లైంట్‌ చేసినోడు!

అధికారులపై మట్టిమాఫియా దౌర్జన్యం

బత్తలపల్లిలో రెచ్చిపోతున్న అక్రమార్కులు


బత్తలపల్లి, జూలై 1:

 ‘రేయ్‌.. ఎవడ్రా మీరు.. నాపైనే కంప్లైంట్‌ చేస్తారా? అస్సలు నాపై కంప్లైంట్‌ చేసినోడు ఎవడు? వాడెవడో చెబితే ఈడ్చి ఈడ్చి తంతా..’ అంటూ ఓ మట్టిమాఫియా అధికారులు, అడ్డొచ్చిన వారిపై రెచ్చిపోయింది. అనుమతి లేకుండా చెరువులో దర్జాగా మట్టిని తవ్వుకుంటూ సొమ్ము చేసుకుంటున్న ఓ వ్యక్తి అధికారితో పాటు దళితులపై నోటికొచ్చినట్లు మాట్లాడిన సంఘటన బత్తలపల్లి మండలంలోని మాల్యవంతం గ్రామంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే... మాల్యవంతంచెరువు నుంచి కొందరు  మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ సీపీఐ నాయకులు శుక్రవారం పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన సీపీఐ నాయకులను వెంటబెట్టుకుని మాల్యవంతం చెరువు వద్దకు వెళ్లాడు. అనుమతులు లేకుండా తరలిస్తున్న దృశ్యాలను చూసిన పంచాయతీ కార్యదర్శి అక్కడున్న వారితో వాదించారు. మట్టిని తరలించకూడదంటూ హెచ్చరించాడు. దీంతో మట్టిమాఫియాలో ఓ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘మీకు కంప్లైంట్‌ ఇచ్చిన వాడు ఎవడు? వాడెవడో చెప్పితే ఈడ్చిఈడ్చి తంతా..’ అంటూ రెచ్చిపోయాడు. అక్కడే ఉన్న సీపీఐ నాయకులు కుళ్లాయప్ప, కమతంకాటమయ్యలపై నానా దుర్భాషలాడాడు. ‘మీరేనా కంప్లైంట్‌ చేసింది.. మీకేం సంబంధం ఉంది. మీరేమైనా పెద్ద పుడింగులా.. మిమ్మల్ని కొడితే ఎవరు దిక్కు... ఎవడొస్తాడు...’ అంటూ ఓ రేంజ్‌లో ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా కులం పేరుతో దూషించాడు. కాసేపు వాగ్వాదం తర్వాత పంచాయతీ కార్యదర్శితో పాటు సీపీఐ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమను కులంపేరుతో దూషించారని సీపీఐ నాయకులు ఎస్‌ఐ శ్రీహర్షకు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధుతో కలిసి ఫిర్యాదుదారులు విలేకరులతో మాట్లాడారు. వారంరోజులుగా పట్టపగలే రెండు ప్రొక్లెయినర్లు పెట్టి 20 ట్రాక్టర్లతో అనుమతులు లేకుండా తరలిస్తున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మంజూరు చేసినా జగనన్నకాలనీలోని లబ్ధిదారులు మట్టితోలుకోవాలంటే అనుమతులు అడిగే అధికారులు మట్టిమాఫియా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మట్టి తోలుకుంటున్నారని ఫిర్యాదు చేసిన సీపీఐ నాయకుడు, దళిత వర్గానికి చెందిన కుళ్లాయప్పపై కులం పేరుతో దూషించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి యత్నించిన వారిపై పోలీసులు కేసునమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 



Updated Date - 2022-07-02T06:13:31+05:30 IST