పెట్రో, గ్యాస్‌ ధరలను తగ్గించాలి

ABN , First Publish Date - 2021-10-29T05:17:19+05:30 IST

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

పెట్రో, గ్యాస్‌ ధరలను తగ్గించాలి
శంకర్‌విలాస్‌ సెంటర్‌లో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు

సామాన్యుడిపై కేంద్రం పెనుభారం  

వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన

గుంటూరు(తూర్పు), అక్టోబరు 28: పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక శంకర్‌విలాస్‌ సెంటర్‌లో వామపక్షాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 22 సార్లు పెరిగాయన్నారు. బీజేపీ పాలనలో పేదవాడు మరింత పేదవాడు, ధనవంతుడు మరింత ధనవంతుడయ్యాడన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు తాకట్టుపెడుతున్నదని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కృష్ణయ్య మాట్లాడుతూ పెట్రోలు ధరలు పెరగడంతో ఆ ప్రభావం 90 రకాల ఉత్పత్తులపై పడిందన్నారు. లీటర్‌ పెట్రోల్‌ రూ.60, డీజిల్‌ రూ.50కు అందించాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నును తగ్గించుకోవాలన్నారు. ధర్నాలో నాయకులు పాశం రామారావు, జంగాల అజయ్‌కుమార్‌, కోటా మాల్యాద్రి, తూమాటి శివయ్య, వి.నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T05:17:19+05:30 IST