సామాన్యుల జీవనం దుర్భరం!

ABN , First Publish Date - 2022-05-16T06:30:18+05:30 IST

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌ దగాకోరు విధానాలతో సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ దుయ్యబట్టారు.

సామాన్యుల జీవనం దుర్భరం!

సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ 

చిట్టినగర్‌, మే 15 : కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌ దగాకోరు విధానాలతో సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ దుయ్యబట్టారు. సీపీఐ 50వ డివిజన్‌ శాఖ మహాసభ ఆదివారం గొల్లపాలెంగట్టు అరుణా కాన్వెంట్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందన్నారు. తరుచుగా పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, రాజన్న రాజ్యం తెస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్‌ నవరత్నాల పేరుతో రూ.10 పెట్టి రూ.100 గుంజుతున్నారన్నారు. విద్యుత్‌, ఆర్టీసీ, నీటి చార్జీల పెంపుతోపాటు ఆస్తి, చెత్తపై పన్ను విధింపునకు తెగబడ్డారన్నారు. నిత్యావసర వస్తువులు, కాయగూరలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. కమ్యునిస్టు పార్టీ ఉద్యమాల్లో ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. సహాయ కార్యదర్శి జీ.కోటేశ్వరరావు, 49,55 డివిజన్ల కార్యదర్శులు తిప్పాబత్తుల వెంకటేశ్వరరావు, పగిడికత్తుల రాము, పార్టీ నేతలు పాల్గొన్నారు. 

డివిజన్‌ నూతన కమిటీ ఏకగ్రీవం

సీపీఐ 50వ డివిజన్‌ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్‌ కార్యదర్శిగా తాడి పైడియ్య, సహాయ కార్యదర్శిగా పిట్టా అప్పారావు, కమిటీ సభ్యులుగా గాడి రాము, బళ్లా నరసింహరాజు, రావాడ దేవుడమ్మ, జీ.రామకృష్ణ, టీ.ధనుంజయరావు, కాగితాల కనకరావు, మోకా దుర్గారావు, ఆహ్వానితులుగా మారేడుపూడి కనకరావు, నడికుదిటి సూర్యనారాయణరాజు, లంకే సాయి సమ్మెటి విష్ణును మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

Updated Date - 2022-05-16T06:30:18+05:30 IST