కరోనా విజృంభిస్తుంటే.. సచివాలయ నిర్మాణమా?

ABN , First Publish Date - 2020-07-11T08:52:24+05:30 IST

ఓవైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే, ప్రజలకు రక్షణ ఇవ్వాల్సింది పోయి.. కొత్త సచివాలయం నిర్మించాలనుకోవడం ..

కరోనా విజృంభిస్తుంటే.. సచివాలయ నిర్మాణమా?

ఇది మానవత్వ వ్యతిరేక చర్య: నారాయణ



హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఓవైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే, ప్రజలకు రక్షణ ఇవ్వాల్సింది పోయి.. కొత్త సచివాలయం నిర్మించాలనుకోవడం మానవత్వ వ్యతిరేక చర్య అని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ ఆరోపించారు. ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ ఖాన్‌ మేనమామ వికారుల్‌ ఉమ్రా ఆలోచనలకు అనుగుణంగా లండన్‌లోని బకింగ్‌హాం రాజప్రాసాద నమూనాతో సచివాలయం నిర్మితమైందని గుర్తుచేశారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఇలాంటి నిర్మాణాలను కూల్చరాదని, పురావస్తు శాఖకు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. నిజాంను పొగిడే కేసీఆర్‌, ఆయన నిర్మించిన భవనాలను పడగొట్టడంలో అర్థం లేదన్నారు. తన శకం నుంచే హైదరాబాద్‌ నిర్మితమైందని చూపించేందుకు కేసీఆర్‌ యత్నిస్తున్నారని నారాయణ ఆరోపించారు.


కేసీఆర్‌కు కరోనా వచ్చిందని తాను భావించట్లేదని, ఆయన ప్రజలందరికీ కరోనా తెప్పిస్తారు తప్ప తెచ్చుకోరని ఎద్దేవా చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కరోనా నుంచి ప్రజలకు రక్షణ అందించాలన్న డిమాండ్‌తో హిమాయత్‌నగర్‌ ఏజీటీయూసీ కార్యాలయం వద్ద సీపీఐ శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యానికి నిరాకరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్ని ప్రభుత్వం స్వాధీనపరచుకుని, మెరుగైన వైద్యసేవల్ని అందించాలని చాడ డిమాండ్‌ చేశారు. సచివాలయ భవనాల కూల్చివేతను పూర్తిగా నిలిపివేసి, కరోనా నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. కూల్చివేత పనులు సోమవారం వరకు నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాల్ని సీపీఎం సమర్థిస్తుందని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


బ్లాకులన్నీ కూల్చివేసినట్టు చెప్పడానికే ప్రభుత్వం అనేక బ్లాకుల్లో ఒకేసారి కూల్చివేతలను పాక్షికంగా చేపట్టిందని విమర్శించారు. కోర్టును పక్కదోవపట్టించే కుతంత్రాలను మానుకుని, కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ఆదుకోవడంపై దృష్టి సారించాలని ఆయన హితవు చెప్పారు. ప్రజల్లో ధైర్యాన్ని కల్పించాల్సిన సీఎం ఇలాంటి సమయంలో కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-07-11T08:52:24+05:30 IST