కోనసీమ జిల్లాకు డాక్టర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టేలా చర్యలు

ABN , First Publish Date - 2022-01-28T05:13:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాను మూడు జిల్లాలుగా చేయడం, విలీన మండలాల గిరిజన ప్రజలను అరకు నియోజకవర్గం పరిధిలోకి తీసుకొస్తున్న నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య, పార్టీ జిల్లా నాయకుల బృందం విజయవాడలో గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణను కలసి పలు అంశాలపై చర్చించింది.

కోనసీమ జిల్లాకు డాక్టర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టేలా చర్యలు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో జిల్లాల విభజన సమస్యలపై చర్చిస్తున్న రాష్ట్ర, జిల్లా నాయకులు

 సీపీఐ రాష్ట్ర నాయకత్వాన్ని కోరిన జిల్లా నాయకులు
రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాను మూడు జిల్లాలుగా చేయడం, విలీన మండలాల గిరిజన ప్రజలను అరకు నియోజకవర్గం పరిధిలోకి తీసుకొస్తున్న నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య, పార్టీ జిల్లా నాయకుల బృందం విజయవాడలో గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణను కలసి పలు అంశాలపై చర్చించింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు వివరాలు అందించారు. ప్రధానంగా కోనసీమ జిల్లాకు డాక్టర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడం, విలీన మండలాల గిరిజనుల అభ్యంతరాలు, వారి ఇబ్బందులను రాష్ట్ర అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. విలీన నాలుగు మండలాల ప్రజలు పాడేరు వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడాల్సి ఉంటుందని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేశారు. మండపేట, తాళ్లరేవు, పెదపూడి, గోకవరం తదితర ప్రాంతాల్లోనూ సమస్యలున్నాయని, వీటిపై త్వరలోనే కలెక్టర్‌ను కలసి వినతిపత్రాలు అందజేస్తామని అన్నారు. జిల్లాల విభజన సమస్యలపై ఫిబ్రవరి 8న జరిగే రాష్ట్ర కార్యవర్గంలో చర్చిస్తామని రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలియజేశారన్నారు. ఈ బృందంలో రాష్ట్ర సమితి సభ్యులు నల్లా రామారావు, నాయకులు కూండ్రపు రాంబాబు, వంగమూడి కొండలరావు, బొమ్మసాని రవిచంద్ర తదితరులున్నారు.

Updated Date - 2022-01-28T05:13:06+05:30 IST