Abn logo
Feb 25 2021 @ 12:26PM

ఉక్కు ఫ్యాక్టరీని కలిసి కాపాడుకుందాం: రామకృష్ణ

విజయవాడ: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ని అందరూ కలిసి కాపాడుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ నాయకులు వ్యతిరేకించారని... అసలు ప్రకటన రాకుండా ఎలా నిందిస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ప్రధాని‌ ప్రకటనతో ప్రైవేటీకరణ ఖాయమని తేలిపోయిందన్నారు. అధికారులతో కమిటీ వేసి.. అంచనాలు కూడా సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. సోము వీర్రాజు, జీవియల్‌కు సిగ్గుంటే బీజేపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని తమకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోతే... ఆ పదవుల్లో తమరెందుకు అని నిలదీశారు. ప్రైవేటీకరణ‌ను ఆపగలిగే శక్తి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలకు మాత్రమే ఉందన్నారు. ఇంత జరుగుతుంటే... కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు. కార్పొరేటర్లను ఏకగ్రీవం చేస్తానంటూ విజయసాయి రెడ్డి విశాఖలో పాదయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి అన్నీ యనభై శాతం కావాలంటూ పోలీసులుతో బెదిరిస్తున్నారన్నారు. ఏపీకి‌ వీరిద్దరూ  అఘోరాల్లాగా తయారయ్యారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే తమకు సమాధులు కట్టడం ఖాయమని హెచ్చరించారు. అరుంధతిలో అఘోరాకు కట్టిన దానికంటే బలంగా కడతారన్నారు. రేపు భారత్ బంద్‌కు సిపిఐ మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని పెట్రో ధరలు మన దేశంలోనే ఎందుకని ప్రశ్నించారు. ప్రజలు అంతా ఇబ్బందులు పడుతున్నా మోదీ స్పందించరన్నారు. అన్ని‌ వర్గాల‌ వారు రోడ్డు ఎక్కుతామన్నా కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవని వ్యాఖ్యానించారు. గ్యాస్ ధరలు ఈ ఒక్క నెలలోనే మూడు సార్లు పెంచారన్నారు. సీపీఐ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో పాల్గొంటున్నామని రామకృష్ణ వెల్లడించారు. 

Advertisement
Advertisement
Advertisement