అమరావతి: అమరావతి రైతుల మహా పాదయాత్రకు సీపీఐ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. నవంబర్ 1 నుండి డిసెంబర్ 17 వరకు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అనే మహా పాదయాత్రకు అమరావతి రైతులు నడుంబిగించారని తెలిపారు. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. సుదీర్ఘకాలంగా అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. మహా పాదయాత్రకు అనుమతిపై డీజీపీ ఈనెల 28 లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవుపలికారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.