అమరావతి: జగనన్న చీకటి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఏపీకి బొగ్గు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలు, డిస్కంల ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలన్నారు. ఏపీ ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరమవుతుందని తెలిపారు. బొగ్గు కొరత కారణంగా సెప్టెంబర్ నెలలో 24 వేల టన్నులు మాత్రమే సరఫరా జరిగిందన్నారు. ఏపీలో 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని అన్నారు. ప్రజలు విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కరెంట్ బిల్ తగ్గాలంటే లైట్లు, ఏసీలు ఆపమని వైసీపీ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గెలుపును ఆపేయడం ఖాయమని రామకృష్ణ స్పష్టం చేశారు.