తీయనైన తెలుగుకు తెగులు పట్టించకండి: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-07-13T15:12:31+05:30 IST

తెలుగు అకాడమీ పేరు మార్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు.

తీయనైన తెలుగుకు తెగులు పట్టించకండి: రామకృష్ణ

అమరావతి: తెలుగు అకాడమీ పేరు మార్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. తీయనైన తెలుగుకు తెగులు పట్టించవద్దని అన్నారు. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటం తగదన్నారు. సంస్కృత భాష పట్ల తమకంత మక్కువుంటే కొత్తగా సంస్కృత అకాడమీని ఏర్పాటు చేయాలని సూచించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రుల మాతృభాష తెలుగును విస్మరిస్తున్నదని మండిపడ్డారు. పిల్లల చదువులలో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని చొప్పించేందుకు ప్రయత్నించిందన్నారు. తెలుగు భాషను నిర్వీర్యం చేసే కుట్రలను ఖండిస్తున్నామని తెలిపారు. తెలుగు అకాడమీని యథాతథంగా కొనసాగించాలని అన్నారు. మాతృభాష అభివృద్ధి కోసం తెలుగు అకాడమీకి తగినన్ని నిధులు కేటాయించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-07-13T15:12:31+05:30 IST