Andhra news: చిరంజీవిపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: నారాయణ
ABN , First Publish Date - 2022-07-20T17:22:39+05:30 IST
మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెనక్కి తీసుకున్నారు.
రాజమండ్రి: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)పై చేసిన వ్యాఖ్యలను సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) వెనక్కి తీసుకున్నారు. భాషా దోషంగా భావించి తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... చిరంజీవి కుటుంబంతో తనకు ఆత్మీయ సంబంధం ఉందన్నారు. రాజకీయంగా విమర్శలు చేయటం సహజమని నారాయణ పేర్కొన్నారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు, జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan)పై నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు(Alluri sitaramaraju) విగ్రహావిష్కరణకు చిరంజీవి హాజరైన విషయాన్ని తప్పుపట్టారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రేక్షకులకు అల్లూరిని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ(Krishna)ను పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. అలాగే పవన్ ఒక ల్యాండ్ మైన్ లాంటివాడని అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు. నారాయణ వ్యాఖ్యలపై చిరు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.
నారాయణ వ్యాఖ్యలపై నాగబాబు కౌంటర్...
మరోవైపు నారాయణ వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు(Nagababu) ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ‘‘కొంత మంది చేసిన తెలివి తక్కువ... వెర్రి వ్యాఖ్యలపై జనసైనికులు, మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే.. ఈ సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి, కేవలం ఎండి గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు.. కాబట్టి మన మెగా అభిమానులందరూ వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి...కాస్త అన్నం పెట్టండి ...! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు’’ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పిస్తూ నాగబాబు ట్వీట్ చేశారు.