గోవాడపై కొరడా.. షుగర్‌ ఫ్యాక్టరీకి సీపీసీబీ షాక్‌

ABN , First Publish Date - 2020-07-10T18:07:59+05:30 IST

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) కొరడా ఝుళిపించింది. కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టిన మండలి... ఫ్యాక్టరీకి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని ఈపీడీసీఎల్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

గోవాడపై కొరడా.. షుగర్‌ ఫ్యాక్టరీకి సీపీసీబీ షాక్‌

కాలుష్య నియంత్రణ చర్యలు అమలులో వైఫల్యంపై సీరియస్‌

 విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని ఈపీడీసీఎల్‌కు ఆదేశాలు

సూచనలు పాటిస్తామంటూ మండలికి లేఖ రాసిన ఎండీ

విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని ఎన్‌జీటీకి వినతి

సానుకూల స్పందన


చోడవరం (విశాఖపట్టణం): గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) కొరడా ఝుళిపించింది. కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టిన మండలి... ఫ్యాక్టరీకి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని ఈపీడీసీఎల్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 5వ తేదీ నుంచి ఫ్యాక్టరీకి విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో నిర్వహణ పనులు ఆగిపోయాయి. దీంతో కంగుతిన్న యాజమాన్యం కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. 


గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో వ్యర్థాల నిర్వహణ, వాయు కాలుష్యానికి సంబంధించి ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ సిస్టం ఏర్పాటుతోపాటు, వాటి నిర్వహణకు సంబంధించిన వి వరాలను ఎప్పటికప్పుడు అందచేయాలని, లేనిపక్షంలో ఫ్యాక్టరీని మూసివేస్తామని  2016లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు హెచ్చరించింది.  కానీ ఫ్యాక్టరీ అధికారులు ఈ సూచనలను పట్టించుకోలేదు. బోర్డు అధికారులు 2018లో సైతం మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి కూడా యాజమాన్యం బేఖాతరు చేసింది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు బయటకు వచ్చి, పక్కనే వున్న శారదా నదిలోకి చేరుతుండడం, నీరు కలుషితం అవుతుండడంతో జీవీఎంసీ అనకాపల్లి జోనల్‌ అధికారులు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏడాది జనవరిలో అధికారుల బృందం షుగర్‌ ఫ్యాక్టరీని సందర్శించింది. వ్యర్థ జలాలను శుద్ధి చేసే ఈటీపీ ప్లాంట్‌లో మొలాసిస్‌ నిల్వ చేయడం, మొలాసిస్‌ను ఆరుబయట గోతుల్లో నిల్వ ఉంచడం, కాలుష్య నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసినా... వాటి వివరాలు నమోదు చేయని వైనాన్ని అధికారుల బృందం గుర్తించింది. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రెండేళ్లు క్రషింగ్‌ నిర్వహించడాన్ని సీరియస్‌గా పరిగణించారు. ఫ్యాక్టరీకి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలంటూ ఈ నెల 4న ఈపీడీసీ ఎల్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ మరుసటి రోజే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 


సూచనలు పాటిస్తామని హామీ ఇచ్చాం: వి.సన్యాసినాయుడు, గోవాడ షుగర్స్‌ ఎండీ

షుగర్‌ ఫ్యాక్టరీలో కాలుష్య నియంత్రణకు ఆన్‌లైన్‌ సిస్టం అమలు చేయడంతోపాటు, కాలుష్య నియంత్రణ బోర్డు ఇచ్చిన సూచనలు పాటిస్తామని లిఖితపూర్వకంగా తెలియపరిచాం. ఫ్యాక్టరీకి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని, ఫ్యాక్టరీ మూసివేతకు సంబంధించి గతంలో జారీ చేసిన నోటీసులు ఎత్తివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాం. దీనిపై సానుకూలంగా స్పందించిన ట్రిబ్యునల్‌... విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు అవకాశం కల్పించింది. ఈటీపీ ప్లాంట్‌ నిర్వహణతోపాటు మొలాసిస్‌ నిల్వకు ట్యాంకుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం.

Updated Date - 2020-07-10T18:07:59+05:30 IST