ఢిల్లీలో వాహనాల వాడకం తగ్గాలి : సీపీసీబీ

ABN , First Publish Date - 2021-11-13T01:33:53+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా

ఢిల్లీలో వాహనాల వాడకం తగ్గాలి : సీపీసీబీ

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉందని, వాహనాల వాడకాన్ని కనీసం 30 శాతం తగ్గించుకోవాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సలహా ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వర్క్ ఫ్రం హోం, ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణాలు వంటి చర్యలను చేపట్టాలని తెలిపింది.  ప్రజలు కూడా నగరంలో గాలి కాలుష్యానికి గురి కాకుండా వ్యవహరించాలని తెలిపింది. ఆరుబయట కార్యక్రమాలను తగ్గించుకోవాలని పేర్కొంది. నగరంలో గాలి నాణ్యత క్షీణతను కట్టడి చేయడం కోసం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) అమలుపై శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం ఈ సలహాలను విడుదల చేసింది.


ఢిల్లీలో గాలి కాలుష్యం సూచీ తీవ్రంగా ఉన్న విషయంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఏమాత్రం సానుకూలంగా లేదని గుర్తించారు. కాలుష్య కారకాల విడుదలకు తగిన పరిస్థితి లేదని గమనించారు. వరి దుబ్బులను కాల్చడం వల్ల వెలువడే కాలుష్యం కూడా అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. 


నవంబరు 8న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్న చర్యలను కఠినంగా అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అన్ని హాట్ మిక్స్ ప్లాంట్లు, స్టోన్ క్రషర్లను మూసివేయాలని ఆదేశించారు. రద్దీ లేని సమయాల్లో ప్రయాణాలను ప్రోత్సహించేందుకు చర్యలు ప్రకటించారు. ప్రజా రవాణా సేవలను వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లలో ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు. 


గాలి నాణ్యత, వాతావరణ సూచన, పరిశోధన వ్యవస్థ (సఫర్) వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత దయనీయ స్థితికి చేరింది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 390కి చేరింది.


Updated Date - 2021-11-13T01:33:53+05:30 IST