ప్రశాంతంగా జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్: సైబరాబాద్ సీపీ

ABN , First Publish Date - 2020-12-04T18:54:15+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సైబరాబాద్ కమిషన్ వీసీ సజ్జనార్ తెలిపారు.

ప్రశాంతంగా జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్: సైబరాబాద్ సీపీ

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సైబరాబాద్ కమిషన్ వీసీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం సైబరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్న 10 డీఆర్సీ, కౌంటింగ్ కేంద్రాలను సీపీ సజ్జనార్ పర్యవేక్షించారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సైబరాబాద్‌లో మొత్తం 10 చోట్ల డీఆర్సీ కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయ్యన్నారు. అన్ని చోట్లా కౌంటింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. మైలార్ దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, సనత్‌నగర్ వంటి 12 చోట్ల సీపీ రిజర్వ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు.  మొదటి అంచెలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద టీఎస్ఎస్పీ, ఆర్మ్‌డ్ రాజర్వ్, రెండవ అంచెలో లా అండ్ ఆర్డర్ సిబ్బంది, మూడవ అంచెలో పెట్రోలింగ్, బ్లూ  కోల్ట్స్ సిబ్బంది ఉంటారన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దనే కాకుండా ఇతర సున్నితమైన, అతి సున్నితమైన ప్రాంతాల్లోనూ పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు. 


డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీ స్థాయి సీనియర్ అధికారులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. సైబరాబాద్‌లో దాదాపు 7000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. సున్నితమైన, అతి సున్నితమైన ప్రాంతాల్లో సీనియర్ అధికారుల పర్యవేక్షణలో పికెట్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చే ఏజెంట్లు సంబంధిత గుర్తింపు పత్రాలను తమ వెంట తప్పక  తీసుకురావాలని స్పష్టం చేశారు.  లేదంటే లోనికి అనుమతించరని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్లు, మాస్కులు, శానిటైజర్లు వంటి మౌలిక వసతులు కల్పించామని చెప్పారు.


ఓట్ల లెక్కింపు ముగిసిన 48 గంటల వరకూ ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు అనుమతి లేదన్నారు. పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతనే ర్యాలీలు నిర్వహించుకోవాలని తెలిపారు. విజయోత్సవ ర్యాలీలలో బాణాసంచా కాల్చడం, డీజె సౌండ్స్ నిషేదం అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో లేనిపోని రూమర్స్‌ను క్రియేట్ చేసి ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇతరులను రెచ్చగొట్టేలా అనుచిత పోస్టులు, మెసేజులు పెట్టిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. సీపీ వెంట డీసీపీ శంషాబాద్ ఎన్ ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., డీసీపీ ట్రాఫిక్ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు, డీసీపీ బాలానగర్ పీవీ పద్మజా, సీఏఆర్ హెడ్ క్వార్టర్ ఏడీసీపీ మాణిక్ రాజ్, ఎస్ఓటీ ఏడీసీపీ సందీప్, ఏడీసీపీ ఇందిరా, ఏడీసీపీ కవిత, కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, ఇన్ స్పెక్టర్లు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-04T18:54:15+05:30 IST