వాట్సాప్‌ గురువు... సీపీ మహేష్‌ భగవత్‌.. సివిల్స్‌ అభ్యర్థులకు మెళకువలు, శిక్షణ

ABN , First Publish Date - 2020-08-07T14:13:36+05:30 IST

పోలీస్‌ ఉద్యోగం అంటేనే ప్రతి రోజూ ఎన్నో కేసులు.. గొడవలు.. సమస్యలు. క్షణం తీరిక ఉండదు.. అందునా ఐపీఎస్‌ అధికారి అంటే ఇంక చెప్పనవసరం లేదు.

వాట్సాప్‌ గురువు... సీపీ మహేష్‌ భగవత్‌.. సివిల్స్‌ అభ్యర్థులకు మెళకువలు, శిక్షణ

ఐదేళ్లలో 500 మందికి పైగా విజేతలు

తాజాగా 110 మంది 

ఏడు ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపుల్లో పర్యవేక్షణ, గైడెన్స్‌


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ ఉద్యోగం అంటేనే ప్రతి రోజూ ఎన్నో కేసులు.. గొడవలు.. సమస్యలు. క్షణం తీరిక ఉండదు.. అందునా ఐపీఎస్‌ అధికారి అంటే ఇంక చెప్పనవసరం లేదు. అలాంటిది దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్‌కు పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తీరిక సమయంలో వందలాది మంది సివిల్స్‌ అభ్యర్థులకు వాట్సాప్‌ గురువుగా మారారు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌. ఆయన పర్యవేక్షణ, గైడెన్స్‌తో యూపీఎస్సీ మౌఖిక పరీక్షల్లో విజయం సాధించి వందలాది మంది సివిల్స్‌ విజేతలుగా నిలిచారు. మంగళవారం యూపీఎస్సీ విడుదలచేసిన ఫలితాల్లో ఆయన శిష్యులు 110 మంది విజయం సాధించారు. 2016 నుంచి ప్రారంభమైన వాట్సాప్‌ గ్రూపుల శిక్షణ ఐదేళ్లుగా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఐదేళ్లలో 500ల మందికి పైగా ఆయన శిష్యులు సివిల్స్‌ విజేతలుగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. ఒక్క వాట్సాప్‌ గ్రూపుతో ప్రారంభమైన శిక్షణ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏడు గ్రూపులకు ఎదిగింది.


దేశ వ్యాప్తంగా...

మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా ఏడు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసిన సీపీ..  వాటిలో సివిల్స్‌ అభ్యర్థులకు ఐదు గ్రూపులు, ఫారెస్టు సర్వీసు-1, సీఏపీఎఫ్‌-1 (ఒక్కో గ్రూపుగా) కేటాయించారు. వారంతా యూపీఎస్సీ మెయిన్స్‌లో ఉత్తీర్ణులై మౌఖిక పరీక్షకు సిద్ధంగా ఉన్నవారు. ఒక్కొక్కరు సంవత్సరాలపాటు రోజుకు పది నుంచి 18 గంటలు కష్టపడి చదివి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించారు. మౌఖిక పరీక్షే అసలు పరీక్ష. అందులో నెగ్గితే చాలు.. అప్పటి వరకు పడిన కష్టం. శ్రమ అంతా ఫలించినట్లే. అలాంటి పరిస్థితిలో ఆపద్భాందవుడిగా మారారు సీపీ. అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షనల్స్‌ ఆధారంగా వారికి మౌఖిక పరీక్షల్లో ఏయే ప్రశ్నలు  వచ్చే అవకాశాలు  ఉన్నాయి..? వాటికి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? ఒకే ప్రశ్న తిప్పి తిప్పి ఎలా అడుగుతారు..?  ఇలా ఎన్నో సమస్యలు.. వాటికి  పరిష్కారాలు.. అభ్యర్థులకు తెలియజేస్తున్నారు. ఐదేళ్లుగా వాట్సా్‌పలోనే బోధన చేస్తున్న సీపీ మహేష్‌ భగవత్‌ వాట్సాప్‌ గురువుగా కూడా పేరుపొందారు. ఆయనతో పాటు.. గత ఏడాది విజేతలుగా నిలిచిన వారు మరుసటి ఏడాది బ్యాచ్‌ అభ్యర్థులకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

Updated Date - 2020-08-07T14:13:36+05:30 IST