ఆ రూ.1,41,60,400 గోడకు కొట్టిన సున్నమే

ABN , First Publish Date - 2021-09-08T06:06:52+05:30 IST

రూ.100 కోట్ల..

ఆ రూ.1,41,60,400 గోడకు కొట్టిన సున్నమే
ఆంధ్రజ్యోతిలో మంగళవారం ప్రచురితమైన కథనం

భూమాయపై సీపీ దృష్టి 

కొమ్మాది డీల్‌పై మరింత లోతుగా దర్యాప్తు

రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల వద్ద వివరాల సేకరణ

ఎవరు, ఏ విధంగా ఒత్తిడి తెచ్చారో ఆరా

ప్రభుత్వానికి త్వరలో నివేదిక

ఇక నుంచి విదేశీ డాక్యుమెంట్లపై ప్రత్యేక కన్ను

స్టాంపు డ్యూటీపై కన్నబాబురాజు ఆశలు వదులుకోవలసిందే


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): రూ.100 కోట్ల భూ మాయపై నగర పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. కొమ్మాదిలో భూమి విలువలు పెంచవద్దని రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బందిపై వచ్చిన ఒత్తిళ్లు, విదేశీ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ విధానం, అందులో జరుగుతున్న మోసాలను ఎలా పసిగట్టాలి? అనే అంశాలపై దృష్టిసారించారు. సంబంధిత అధికారులతో మంగళవారం చర్చించి, వివరాలు సేకరించారు. వీటన్నింటిపై ప్రభుత్వానికి నివేదిక పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. 


ఏదీ అడ్డుకునే అవకాశం లేదు

రిజిస్ట్రేషన్ల శాఖకు ఏ ఆస్తి రిజిస్ట్రేషన్‌కు వచ్చినా...దానికి తగిన ఫీజులు కట్టించుకొని, అమ్మకందారు, కొనుగోలుదారు లేదా వారి ప్రతినిధులు హాజరైతే రిజిస్టర్‌ చేయాల్సిందే. ఆ రిజిస్ట్రేషన్‌ను పక్కనపెట్టేందుకు, ఆపేందుకు అధికారం లేదు. అది ప్రభుత్వ భూమి లేదా నిషేధిత జాబితాలో వున్న ఆస్తి అయితే తప్ప తిరస్కరించలేరు. కొమ్మాది కేసులో తుమ్మల కృష్ణచౌదరి భార్య లక్ష్మీ సూర్యప్రసన్న వచ్చి ఫిర్యాదు చేశారు. తాము ఆ భూమి అమ్మడం లేదని, అది తప్పుడు ‘స్పెషల్‌ పవర్‌’ అని ఆరోపించారు. అయితే రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనల ప్రకారం...ఆమెకు ఆ భూమిపై హక్కు లేదు. కాబట్టి ఆమె అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.


అలాగే కృష్ణ చౌదరి పేరుతో నిందితులు అమెరికా నుంచి ‘స్పెషల్‌ పవర్‌’కు నోటరీ చేయించిన పత్రాలు (ఫోర్జరీవి) పంపారు. అది ఆస్తి అమ్మకపు పత్రాలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సమర్పించడానికి మాత్రమే ఇచ్చిన స్పెషల్‌ పవర్‌. అందులో కృష్ణచౌదరి సంతకం, డాక్యుమెంట్‌లో సంతకం ఒకేలా ఉండడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు అనుమానం కలగలేదు. పైగా వారికి తానే ఆ పత్రాలు పంపినట్టు కృష్ణచౌదరి పేరుతో మెయిల్‌ కూడా పంపించారు. మెయిల్స్‌ కూడా ఫేక్‌ వుంటాయని అధికారులు ఊహించకపోవడం వల్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు అవసరమైన ఫీజులు కట్టించుకున్నారు. 


ఆ రూ.1,41,60,400 గోడకు కొట్టిన సున్నమే

కొమ్మాదిలో 12.26 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ కోసం (ఎకరా విలువ రూ.1.52 కోట్ల చొప్పున లెక్కగట్టి) కన్నబాబురాజు కుటుంబం స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ ఫీజు, రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద ప్రభుత్వానికి రూ.1,41,60,400 చెల్లించింది. అక్కడ ప్రభుత్వ రేటు రూ.2.2 కోట్లు ఉండగా, సెక్షన్‌ 47-ఏ ప్రకారం తక్కువ ధరకు రిజిస్టర్‌ చేయాలని కన్నబాబు అండ్‌ కో కోరింది. ఫీజు తక్కువగా కట్టడంతో డాక్యుమెంట్‌ను పెండింగ్‌ పెట్టారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్‌ కొనుగోలు చేసిన పార్టీకి లేఖ రాసి, ఆ భూమిని చూపించాల్సిందిగా కోరాల్సి ఉంది. ఆ తరువాత అక్కడికి వెళ్లి చుట్టుపక్కల ధరలు తెలుసుకొని, వారి అభ్యర్థన మేరకు రేటు తగ్గించవచ్చునా? లేదా? అనేది నిర్ణయిస్తారు. కూడదు అంటే..మిగిలిన మొత్తానికి ఇంకా ఫీజులు కట్టాల్సి ఉంటుంది. ఇది రెగ్యులర్‌గా జరిగే విధానం.


ఇప్పుడు ఈ కేసులో ఇటు పోలీసుల నుంచి గానీ, అటు భూ యజమాని నుంచి గానీ ప్రత్యేక ఆదేశాలు/విన్నపం వస్తే తప్ప ఈ పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అవకాశం లేదు. ఇకపోతే కన్నబాబురాజుకు ఈ భూమి దఖలు పడే అవకాశం లేదు. జయసూర్య, జరజాపు శ్రీనివాసరావులకు ఆయన ఇచ్చిన రూ.4.99 కోట్లు వెనక్కి వచ్చినా, ప్రభుత్వానికి చెల్లించిన ఫీజులు రూ.1.42 కోట్లు మాత్రం రావు. 


విదేశీ పత్రాల పరిశీలనకు ప్రత్యేక సెల్‌!!

ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ప్రత్యేక అనుమతులు (జనరల్‌ పవర్‌, స్పెషల్‌ పవర్‌) తెచ్చుకొని చాలా మంది ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ఒక్క విశాఖపట్నంలోనే నెలకు 150 నుంచి 170 వరకు ఇలాంటి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కొమ్మాది భూ వ్యవహారంలో కృష్ణ చౌదరిలా మరో వ్యక్తి ఫోన్‌లో మాట్లాడి, తప్పుడు నోటరీ చేయించి, తప్పుడు సంతకాలతో రూ.100 కోట్ల భూమి కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి పత్రాలను పరిశీలించి తప్పుడువని గుర్తించేందుకు ఒక వ్యవస్థ లేదా సెల్‌ ఏర్పాటు చేస్తే మంచిదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. విదేశాల నుంచి వచ్చే వాటిని కస్టమ్స్‌ అధికారులు ఎలాగైతే పరిశీలించి ఆమోదముద్ర వేస్తారో, అలాగే ఇలాంటి పత్రాల విషయంలోను ఎంబసీ నుంచి వచ్చినా, నోటరీ నుంచి వచ్చినా అది సరైనదా? కాదా? అని చెప్పి ఆమోదించే వ్యవస్థ ఒకటి ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు అన్ని శాఖల అభిప్రాయాలతో ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాలని నిర్ణయించారు. 


ఎలాంటి ఒత్తిళ్లు వచ్చాయి?

కొమ్మాది భూమి విలువ నిర్ధారణలో గానీ, రిజిస్ర్టేషన్‌ విషయంలో గానీ ఏమి జరిగిందనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం ప్రత్యేక విచారణ చేశారు. గత ఏడాది ఆగస్టులో భూమి విలువలు పెంచుతున్నప్పుడు అక్కడ ధర పెంచవద్దని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు జరుగుతున్న ప్రచారంపై దృష్టిపెట్టారు. అసలు ఏమి జరిగింది? అనే విషయాలు సేకరించారు. అయితే ఇప్పుడు ఉన్న అధికారులతో పాటు నాడు అక్కడ పనిచేసిన అధికారులను విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం వుందనే వాదన వినిపిస్తోంది. ఇటీవల మార్పులు జరిగాయని, కొత్తగా వచ్చిన వారికి పాత విషయాలు తెలియవని అంటున్నారు. 


పూర్తి స్టాంపు డ్యూటీ కట్టి ఉంటే...భూమి చేజారిపోయేదే 

కొమ్మాది భూమి విషయంలో కన్నబాబురాజు రెండు రకాలుగా ఆశ పడ్డారు. ఒకటి రూ.100 కోట్ల భూమిని రూ.19 కోట్లకే దక్కించుకోవాలని చూశారు. అంతేకాకుండా భూమిని ప్రభుత్వ రేటు ప్రకారం కాకుండా ఇంకా తక్కువ ధరకు రిజిస్టర్‌ చేసుకోవాలని, తద్వారా స్టాంపు డ్యూటీ భారం తగ్గించుకోవాలని చూశారు. అదే  ప్రభుత్వ రేటు ప్రకారం ఆయన ఎకరా రూ.2.2 కోట్లకు స్టాంపు డ్యూటీ కట్టేసి ఉంటే...అధికారులు ఆ డాక్యుమెంట్‌ను పెండింగ్‌ పెట్టకుండా అదేరోజు రిజిస్టర్‌ చేసేసి ఉండేవారు. 

Updated Date - 2021-09-08T06:06:52+05:30 IST