లాకౌట్‌ దిశగా కోయ పరిశ్రమ

ABN , First Publish Date - 2022-05-20T05:09:12+05:30 IST

కొత్తూర్‌ పారిశ్రామికవాడలోని కోయ అండ్‌ కంపెనీ

లాకౌట్‌ దిశగా కోయ పరిశ్రమ
మూతపడనున్న కోయ పరిశ్రమ

  • ఉపాధి కోల్పోనున్న వందమంది కార్మికులు


కొత్తూర్‌, మే 19: కొత్తూర్‌ పారిశ్రామికవాడలోని కోయ అండ్‌ కంపెనీ కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ పరిశ్రమ లాకౌట్‌ కానుంది. జూన్‌ 1వ తేదీ నుంచి పరి శ్రమను మూసి వేస్తున్నట్లు యాజమాన్యం పరిశ్రమ ఆవరణలో నోటీస్‌ అంటించడం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అలాగే షాద్‌నగర్‌ లేబర్‌ కార్యాలయంలో పరిశ్రమ యాజమాన్యం ఏప్రిల్‌ మాసంలో గుట్టుచప్పుడు కాకుండా నోటీసును అందజేసినట్లు తెలిసింది. లాకౌట్‌ నోటీసును చూసిన కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాదాపు 32సంవత్సరాల క్రితం కోయ పరిశ్రమను స్థాపించారు. ఈ పరిశ్రమలో తాగునీరు సరఫరా అయ్యే భారీ సిమెంట్‌ పైపులను ఉత్పత్తి చేసేవారు. మిషన్‌ భగీరథ, భారీ తాగునీటి ప్రాజెక్టులకు గతంలో కోయ పరిశ్రమ పైపులను సరఫరా చేసింది. పరిశ్రమలో దాదాపు 30మంది వరకు పర్మినెంట్‌, 70మంది దినసరి కార్మికులు పనిచేస్తున్నారు. తమ ఉత్పత్తులకు ఆర్డర్లు లేనందున పరిశ్రమ మూసివేస్తున్నట్లు పరిశ్రమ యాజమాన్యం నోటీసులో తెలిపింది. తమ దగ్గర పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్‌, గ్రాట్యువిటీ, బోనస్‌ తదితర సౌకర్యాలను కార్మిక చట్టం ప్రకారం అందజేస్తామని పరిశ్రమ యాజమాన్యం నోటీ్‌సలో ప్రకటించింది. పరిశ్రమను మూతపడుతుండటంతో దాదాపు వంద మంది కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ బతుకులు బజారు పాలవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 


కార్మికులను అన్నివిధాలా ఆదుకోవాలి

కోయ పరిశ్రమ మూసివేతతో దాదాపు వందమంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. కార్మికులను పరిశ్రమ యాజమాన్యం అన్ని విధాలా ఆదుకొని పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. లోకపోతే ఆందోళనలు చేస్తాం. మూతపడే పరిశ్రమలకు ప్రభుత్వం వర్క్‌ ఆర్డర్స్‌ ప్రవేశపెట్టి ఆదుకుంటే కార్మికులకు న్యాయం జరుగుతుంది. పరిశ్రమను మూసివేస్తున్నామని యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ఏప్రిల్‌ మాసంలో కార్మిక శాఖ అధికారులకు లేఖలు అందజేసి, ఇటీవల పరిశ్రమ ఆవరణలో నోటీసు అంటించడం ఆంతర్యమేమిటో అర్ధం కావడం లేదు.

- పినపాక ప్రభాకర్‌, కార్మిక సంక్షేమ సంఘం, రాష్ట్ర కన్వీనర్‌



Updated Date - 2022-05-20T05:09:12+05:30 IST