పిరికిపంద: బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతపై ప్రియాంక ఫైర్

ABN , First Publish Date - 2022-01-25T21:46:27+05:30 IST

ఆర్‌పీఎన్‌తో కలిపి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ముగ్గురు పెద్ద నాయకులను కోల్పోయింది. 2019లో ప్రియాంకతో పాటు ఉత్తరప్రదేశ్‌ ఇంచార్జీ బాధ్యతలు తీసుకున్న జ్యోతిరాదిత్య సిందియా, యూపీలో బ్రాహ్మణులకు పెద్ద దిక్కుగా కనిపించే జితిన్ ప్రసాద ఇప్పటికే బీజేపీలో చేరారు..

పిరికిపంద: బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతపై ప్రియాంక ఫైర్

లఖ్‌నవూ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘పిరికిపందలు పోరాటం చేయలేరు’ అంటూ ప్రియాంక ఘాటుగా స్పందించారు. కాగా, ఆర్‌పీఎన్ పార్టీ ఫిరాయింపుపై స్పందిస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం సాహసంతో కూడుకొని ఉంటుంది. ఈ పోరాటం చేయాలంటే ఎంతో శక్తి, ధైర్యం కావాలి. పిరికిపందలు ఈ పోరాటం చేయలేరు’’ అని ప్రియాంక వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిథి సుప్రియా శ్రీనాథ్ పేర్కొన్నారు.


ఆర్‌పీఎన్‌తో కలిపి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ముగ్గురు పెద్ద నాయకులను కోల్పోయింది. 2019లో ప్రియాంకతో పాటు ఉత్తరప్రదేశ్‌ ఇంచార్జీ బాధ్యతలు తీసుకున్న జ్యోతిరాదిత్య సిందియా, యూపీలో బ్రాహ్మణులకు పెద్ద దిక్కుగా కనిపించే జితిన్ ప్రసాద ఇప్పటికే బీజేపీలో చేరారు. కాగా, తాజాగా ఆర్‌పీఎన్ పార్టీ వీడారు. ఓబీసీ సామాజిక వర్గంలో ముఖ్యనాయకుల్లో ఒకరైన ఆర్‌పీఎన్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మొదటి విడత పోలింగ్‌కి రెండు వారాల ముందు పార్టీ ఫిరాయించడం కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని అంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ఓబీసీ నేతలు వరుసపెట్టి బీజేపీనీ వీడుతున్న సమయంలో ఆర్‌పీఎన్‌ బీజేపీలో చేరడం గమనార్హం.

Updated Date - 2022-01-25T21:46:27+05:30 IST