మహానంది, మార్చి 3: నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం చిరుతపులి ఆవును గాయపర్చినట్లు స్థానికులు తెలిపారు. మహానంది సమీపంలోని పార్వతీపురం కాలనీ రైతుకు చెందిన ఆవు మేత కోసం సమీపంలోని నల్లమల అడవిలోకి వెళ్లింది. ఆ సమయంలో చిరుతపులి దాడి చేసింది. గాయపడ్డ ఆవు పరుగులు పెడుతూ శివారు ప్రాంతంలోకి చేరింది. విషయాన్ని గమనించిన స్థానికులు గాయపడ్డ ఆవును చూసి యజమానికి తెలిపారు. ఎంసీ ఫారం పశువైద్యశాల వైద్యుడికి సమాచారం ఇవ్వడంతో గోవుకు చికిత్సలు అందజేశారు. విషయం తెలుసుకొన్న అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ముర్తుజావలి సిబ్బందితో కలసి నల్లమల పరిసరాల్లో చిరుత కోసం గాలింపు జరిపారు.