లక్ష దాటిన కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-05-17T05:43:06+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు లక్ష దాటాయి. ఆదివారం 2,874 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా, 730 మందికి పాజిటివ్‌ వచ్చింది.

లక్ష దాటిన కొవిడ్‌ కేసులు

  1. తాజాగా 730 మందికి వైరస్‌ 
  2. చికిత్స పొందుతూ ఆరుగురి మృతి 


కర్నూలు(హాస్పిటల్‌), మే 16: జిల్లాలో కరోనా కేసులు లక్ష దాటాయి. ఆదివారం 2,874 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా, 730 మందికి పాజిటివ్‌ వచ్చింది. తాజా కేసులతో కలిపి జిల్లాలో బాధితుల సంఖ్య 1,00,287కు చేరింది. రాష్ట్రంలో లక్ష కేసులు దాటిన జిల్లాల్లో కర్నూలు 8వ స్థానంలో నిలిచింది. 7,568 మంది బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 92,087 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. జిల్లాలో మరణాల సంఖ్య 632కు చేరింది. 


20 దాటిన పాజిటివ్‌ రేటు

కరోనా సెకండ్‌ వేవ్‌ జిల్లాలో వాయువేగంతో విస్తరిస్తోంది. ఈ నెలలో ఇప్పటికే 22,665 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో పాజిటివ్‌ రేటు 20 దాటింది. సెకండ్‌ వేవ్‌ మార్చి నెలలో ప్రారంభమైంది. మార్చిలో 703 కేసులు, ఐదు మరణాలు, ఏప్రిల్‌ 14,954 కేసులు 54 మరణాలు, మే ఇప్పటి వరకూ 22,665 కేసులు 84 మరణాలు నమోదయ్యాయి. 


నేటి నుంచి కొవాగ్జిన్‌ టీకా

నగరంలోని ఐదు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో కొవాగ్జిన్‌ రెండో డోసు టీకా సోమవారం నుంచి వేస్తామని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డా.విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. నగర పాలక సంస్థ అధికారులకు 11 వేల డోసులు పంపిణీ చేశామని తెలిపారు. రోజా వీధి-2, జొహరాపురం-2, శరీన్‌నగర్‌, బండిమెట్ట, వీకర్‌సెక్షన్‌ కాలనీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో టీకా వేస్తామని తెలిపారు. కొవాగ్జిన్‌ డోసులు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. స్లిప్‌లు ఉన్నవారికి మాత్రమే కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ వేస్తామని తెలిపారు. మొదటి డోసు వేయించుకుని 5-6 వారాలు పూర్తయిన వారికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. 


నేటి నుంచి ఉద్యోగులకు

45 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కార్పొరేషన్‌ ఉద్యోగులకు సోమ వారం నుంచి కొవిషీల్డ్‌ మొదటి డోసు వ్యాక్సిన్‌ వేస్తామని డీఐవో తెలిపారు. జిల్లాకు సరిపడా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-05-17T05:43:06+05:30 IST