ప్రముఖ ఆస్పత్రికి తెలంగాణ సర్కార్ షాక్.. కరోనా చికిత్స రద్దు

ABN , First Publish Date - 2020-08-05T02:55:57+05:30 IST

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో భాగ్యనగరంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల

ప్రముఖ ఆస్పత్రికి తెలంగాణ సర్కార్ షాక్.. కరోనా చికిత్స రద్దు

హైదరాబాద్ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో భాగ్యనగరంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు రోజురోజుకు మరింత దారుణంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం విదితమే. మరీ ముఖ్యంగా చికిత్స పేరుతో ప్రజల నుంచి సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రి లక్షల్లో వసూలు చేయగా కేసీఆర్ సర్కార్ ఊహించని షాకిచ్చిన విషయం తెలిసిందే. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు డెక్కన్ ఆస్పత్రికి ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.


చికిత్స రద్దు ఎందుకంటే..

ఇవాళ కూడా నగరంలోని ప్రముఖ ఆస్పత్రి అయిన ‘విరించి’పై తెలంగాణ ఆరోగ్యశాఖ వేటు వేసింది. మంగళవారం రాత్రి విరించి ఆస్పత్రిలో కరోనా వైద్యం రద్దు చేస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసింది. ఈ ఆస్పత్రిపై గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున రోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురు కరోనా రోగుల నుంచి రోజుకు లక్ష రూపాయిలు చొప్పున వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.


నిన్న డెక్కన్.. నేడు విరించి..

బాధితుల నుంచి రోజుకు రూ. 10వేలకు మించి తీసుకోకూడదని నిబంధనలు ఉన్న విషయం విదితమే. అయితే ఈ విరించిలో మాత్రం బిల్లుల్లో భారీగా తేడాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా బిల్లులు, ఫిర్యాదులను నిశితంగా పరిశీలించిన అనంతరం విరించికి కరోనా చికిత్సను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా నిన్న డెక్కన్ ఆస్పత్రిపై వేటు పడగా.. ఇవాళ విరించి హాస్పిటల్‌పై వేటు పడింది. ఇకనైనా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ఈటల స్ట్రాంగ్ వార్నింగ్..

మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్.. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా చికిత్సకు రూ.వెయ్యి కూడా ఖర్చు కాదని.. ప్రైవేట్‌ ఆస్పత్రులు గతంలో లాగా వ్యాపారం చేయొద్దని హెచ్చరించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఒకట్రెండు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా చికిత్స అందించనున్నట్లు ఈటల తెలిపారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని.. దీని కంటే భయంకరమైన వైరస్‌లు ఎన్నో వచ్చాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయవద్దని రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ఈటల సూచించారు.





Updated Date - 2020-08-05T02:55:57+05:30 IST