Abn logo
May 8 2021 @ 08:43AM

భారత్‌ పరిస్థితి చూస్తుంటే.. గుండె తరుక్కుపోతుంది: కమలా హ్యారిస్

వాషింగ్టన్: కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ విలవిల్లాడుతోంది. ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆస్పత్రుల్లో కరోనా రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి. మరోవైపు ప్రాణవాయువు కొరత కారణంగా గాల్లో కలుస్తున్న ప్రాణాలు. ఇలా ప్రస్తుతం భారత్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. ఇండియాలో కరోనా కేసులు, మరణాలు భారీ సంఖ్యలో నమోదుకావడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని అన్నారు. గత కొన్ని రోజులుగా వరుసగా నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. దీంతో ఆస్పత్రుల్లో కొవిడ్ రోగులకు బెడ్స్, ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.


భారత్‌లోని పరిస్థితులు హృదయవిదారకమని ఉపాధ్యక్షురాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా మృతుల ఫ్యామిలీలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్‌కు అగ్రరాజ్యం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే భారత్​కు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, ఇతర అత్యవసర వైద్య సామగ్రిని పంపించామన్నారు. గడిచిన వారం రోజుల్లోనే అమెరికా ప్రభుత్వం భారత్​కు 100 మిలియన్ డాలర్ల సాయం చేసిందని కమల గుర్తు చేశారు​.


"మహమ్మారి కరోనావైరస్ ప్రారంభ దశలో అమెరికాలోని ఆస్పత్రులకు కావాల్సిన సహకారం భారత్ అందించింది. ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్న సమయంలో మేము భారత్​కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మన భారతీయ మిత్రుల కోసం మనం అందరం కలిసి పని చేయాలి. గ్లోబల్ కమ్యూనిటీలోని ఏషియన్ క్వాడ్ సభ్యుల మద్దతు చాలా అవసరం. మనం అందరం కలిసి పనిచేస్తే తప్పకుండా సాధిస్తాం. అలాగే ప్రపంచ దేశాలు కలిసి పనిచేస్తే... కరోనాను అంతం చేయడం పెద్ద విషయమేమి కాదు. ఇప్పటికే భారత్​కు ఆక్సిజన్ సిలిండర్లు, పీపీఈ కీట్లు, కాన్సంట్రేటర్లు, టీకాల తయారీకి ముడిసరుకులు, అత్యవసర వైద్య సామగ్రి పంపించాం. భారత్​తో పాటు ఇతర దేశాలకు కరోనా టీకాలను అందించే ఉద్దేశంతో పేటెంట్‌ హక్కులను తొలగించేందుకు మద్దతిచ్చాం." అని ఉపాధ్యక్షురాలు చెప్పుకొచ్చారు.  


అటు భారతీయ అమెరికన్లు సైతం మాతృదేశానికి సహాకరించేందుకు తమకు తోచిన సాయం చేస్తున్నారని గుర్తు చేశారు. మిలియన్ల డాలర్ల విరాళాలు సేరకరించి, వాటితో వైద్యసామాగ్రి, మెడిసిన్స్ కొనుగోలు చేసి స్వదేశానికి పంపిస్తున్నారన్నారు. సేవా ఇంటర్నెషనల్ యూఎస్ఏ 10 మిలియన్ల డాలర్లు, ఏఏపీఐ(అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) 3.5 మిలియన్ డాలర్లు, ఇండియాస్పోరా 2 మిలియన్ డాలర్లు ఇలా పలు భారతీయ అమెరికన్ సంస్థలు విరాళాల సేకరణలో కీలకంగా వ్యవహరించినట్లు కమల తెలియజేశారు. సంక్షోభ సమయంలో మాతృదేశానికి భారతీయులు చేయూతను ఇవ్వడం అభినందనీయం అన్నారు. ఇక తన వంశం మూలాలు భారత్​లోనే ఉన్నాయని కమల అన్నారు. తన తల్లి శ్యామలా గోపాలన్ భారత్​లోనే పుట్టి, పెరిగారని గుర్తు చేశారు. చెన్నైకి చెందిన శ్యామలా పౌరహక్కుల కార్యకర్త కూడా. 

Advertisement