సెకెండ్ వేవ్‌తో బ్యాంకులకు ఇక్కట్లు!

ABN , First Publish Date - 2021-04-10T17:15:44+05:30 IST

కొవిడ్‌-19 వ్యాప్తి కారణంగా ఈ ఏడాది భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోబోతోందని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది.

సెకెండ్ వేవ్‌తో బ్యాంకులకు ఇక్కట్లు!

కొవిడ్‌-19 వ్యాప్తి కారణంగా ఈ ఏడాది భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోబోతోందని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ, బ్యాంకుల పురోగతికి సెకెండ్ వేవ్‌తో ముప్పు పొంచి ఉందని పేర్కొంది. 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత్‌ జీడీపీ వృద్ధి 12.8 శాతంగా నమోదుకావచ్చని ఫిచ్‌ అంచనా వేసింది. కొత్తగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఏప్రిల్‌-జూన్‌లో వృద్ధి నెమ్మదించొచ్చనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాను వెలువరించింది. అయితే కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటే వృద్ధి అంచనాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. 


అత్యధిక శాతం ప్రజలకు టీకాను త్వరగా, సమర్థంగా అందించడం ద్వారా కోవిడ్-19 ప్రభావాన్ని గణనీయంగా తగ్గించొచ్చని అభిప్రాయపడింది. `80 శాతం కొత్త కేసులు ఆరు ప్రధాన రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో 45 శాతం రుణాలు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కరోనా వల్ల ఆ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలకు అవరోధాలు ఏర్పడితే వ్యాపార సెంటిమెంటు దెబ్బతినొచ్చ`ని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. అయితే గత సంవత్సరం మాదిరి కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించే అవకాశాలు లేవు కాబట్టి తీవ్ర ఆందోళన అవసరం లేదని పేర్కొంది.

Updated Date - 2021-04-10T17:15:44+05:30 IST