కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి
న్యూఢిల్లీ: కొవిడ్ థర్డ్ వేవ్ ఆందోళన నేపథ్యంలో త్వరలో పిల్లలకు కొవిడ్ టీకాలు వేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ దశలో ఉందని మంత్రి చెప్పారు. జైడస్ కాడిలా, భారత్ బయోటెక్ టీకాలు పిల్లలకు ట్రయల్ దశలో ఉన్నాయని, వీటి పరిశోధనా ఫలితాలు వచ్చే నెలలో విడుదల కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. 2 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు కోవాక్సిన్ ఫేజ్ 2,3 పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. అశాజనక ఫలితాలు రాగానే సెప్టెంబరు నాటికి పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్లు వేస్తామని మంత్రి వివరించారు.చట్టబద్ధమైన అనుమతులకు లోబడి 12 ఏళ్ల వయసు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రమంత్రి చెప్పారు.