తుస్‌.. చర్యల్లేవ్‌

ABN , First Publish Date - 2021-04-16T07:12:36+05:30 IST

ప్రత్తిపాడు, కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి వైద్యసిబ్బంది కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చిన వ్యవహారం నీరుగారిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఇంటికివెళ్లి వ్యాక్సిన్‌ వేయడంపై దుమారం రేగడంతో కలెక్టర్‌ మురళీధరరెడ్డి ఇటీవల విచారణకు ఆదే శించగా, తీరా అది కాస్తా తుస్సుమనిపించేశారు.

తుస్‌..  చర్యల్లేవ్‌

  • నీరుగారిన ఎమ్మెల్యేల ‘ఇంట్లో వ్యాక్సిన్‌’ వ్యవహారం
  • షోకాజ్‌ నోటీసులతో సరిపుచ్చిన వైద్యఆరోగ్యశాఖ
  • కలెక్టర్‌ సీరియస్‌.. విచారణకు డీఎంహెచ్‌ఓకు ఆదేశం
  • తీరా కీలక నేతల ఒత్తిడితో తుస్సుమన్న విచారణ

కాకినాడ (ఆంధ్రజ్యోతి): ప్రత్తిపాడు, కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి వైద్యసిబ్బంది కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చిన వ్యవహారం నీరుగారిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఇంటికివెళ్లి వ్యాక్సిన్‌ వేయడంపై దుమారం రేగడంతో కలెక్టర్‌ మురళీధరరెడ్డి ఇటీవల విచారణకు ఆదే శించగా, తీరా అది కాస్తా తుస్సుమనిపించేశారు. పెద్దగా వైద్య సిబ్బందిపై చర్యలు లేకుండా కేవలం షోకాజ్‌ నోటీసులు ఇచ్చి వదిలేశారు. మరోసారి ఇలా చేయకూడదని మందలించారు. దీనివెనుక అధికారపార్టీ కీలక నేతల ఒత్తిళ్లు పనిచేయడంతో ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా వదిలేశారు. వాస్తవానికి కొవిడ్‌ టీకాను ప్రతి ఒక్కరు ఆసుపత్రికి వెళ్లి తీసుకోవాలి. టీకా తీసుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తే తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు వీలుగా కేంద్రం మార్గదర్శకాలు విధించింది. అందులోభాగంగానే గతనెల ప్రధాని మోదీ దగ్గర నుంచి సీఎం జగన్‌ వరకు ఆసుపత్రికి వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కానీ ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌ ఏకంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఇంటికి పిలిపించుకున్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దీప్తి ఏప్రిల్‌ 7న ఎమ్మెల్యేకు ఇంట్లో టీకా వేశారు. అలాగే కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కూడా వైద్య సిబ్బందిని ఇంటికి పిలిపించుకుని వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. గోపాలపురం పీహెచ్‌సీ డాక్టర్‌ ఇందుశ్రీ ఈ టీకాను ఎమ్మెల్యేకు ఆయన నివాసంలో వేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినా వైద్య సిబ్బంది లేదా మెడికల్‌ ఆఫీసర్‌ ఇంటికి వెళ్లి టీకా వేయడానికి నిరాకరించాలి. కానీ ఇదేదీ చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా సదరు ఎమ్మెల్యేల ఇంటికే వెళ్లి టీకా వేశారు. దీనిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ రెండు చోట్లా జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కావడం, తెరవెనుక అధికార పార్టీ కీలకనేతల ఒత్తిళ్లు తీవ్రంగా ఉండడంతో విచారణ నీరుగార్చేశారు. ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి వ్యాక్సిన్‌ వేసిన మెడికల్‌ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకుండా వదిలేశారు. అయితే విమర్శలు రాకుండా వీరిద్దరికి కేవలం షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ఎందుకు అలా చేశారనేదానిపై వివరణ తీసుకున్నారు. మళ్లీ ఇలా చేయవద్దని సూచించారు.

Updated Date - 2021-04-16T07:12:36+05:30 IST