వారానికి రెండు రోజులే

ABN , First Publish Date - 2021-05-14T07:02:51+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ టీకా ఇకపై వారానికి రెండు రోజులు మాత్రమే పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

వారానికి రెండు రోజులే

  • మంగళ, శుక్రవారాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో టీకా
  • మిగిలిన రోజులు వ్యాక్సిన పంపిణీ చేయకూడదని నిర్ణయం
  • వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించిన కలెక్టర్‌
  • రెండో డోసుకు నేటి నుంచి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే
  • దీని ఆధారంగా వ్యాక్సిన ఎప్పుడు ఇస్తారనేది కూపన్లలో వెల్లడి
  • అధికారుల నిర్ణయంతో జనంలో ఆందోళన 
  • ఆలస్యంపై గుబులు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ టీకా ఇకపై వారానికి రెండు రోజులు మాత్రమే పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం, శుక్రవారాల్లో మాత్రమే ఎంపిక చేసిన టీకాను వేయనున్నారు. కాగా శుక్రవారం రంజాన్‌, శని, ఆది,సోమవారాల్లో టీకా పంపిణీ ఉండదని అధికారులు పేర్కొన్నారు. రెండో డోసును మంగళవారం మాత్రమే ఇవ్వనున్నారు. అటు టీకా పంపిణీ విధానాన్ని కూడా పూర్తిగా మార్చుతూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అందులో   భాగంగా కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ ఇప్పటికే మొదటి డోసు పూర్తి     చేసుకున్న వారు సంబంధిత నివాస ప్రాంతంలోని గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి తమకు రెండో డోసు కావాలని దరఖాస్తు చేసుకోవాలి. తొలి డోసు ఎప్పుడు పూర్తయింది? తేదీ? ఇతర ఆధారాలు అందించాలి. వీటిని పరిశీలించి వలంటీర్లు, ఏఎన్‌ఎం రెండో డోసు ఎప్పుడు ఇస్తామనేది కూపన్లో తెలుపుతారు. ఆ తేదీలో మాత్రమే ఎంపిక చేసిన వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రానికి వెళ్తే టీకా వేస్తారు. ఈ కొత్త విధానంలో భాగంగా శుక్రవారం నుంచి సచివాలయాల్లో రెండో డోసు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి వారంలో మంగళవారం, శుక్రవారాల్లో ఏదో ఒక తేదీ ఇస్తారు. మరోపక్క జిల్లాలో శాశ్వత వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రాలు 74 ఏర్పాటు చేశారు. వీటి వద్దకే సంబంధిత ప్రాంతానికి చెందినవారు వెళ్లాల్సి ఉంటుంది. కాగా జిల్లాలో కొవిడ్‌ టీకా కొరత భారీగా ఉంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా తొలి డోసు కింద కొవిషీల్డ్‌ 4,00,015కు పైగా వ్యాక్సిన్లు ఇవ్వగా, వీరిలో సెకండ్‌ డోసు 1.80 లక్షల వరకు పంపిణీ చేశారు. ఇంకా 2.19 లక్షల మందికి సెకండ్‌ డోసు ఉంది. వీరిలో వేలాది మందికి ఇప్పటికే గడువు ముగిసింది. కొవాగ్జిన్‌ విషయానికి వస్తే అన్ని వర్గాలకు కలిపి ఫస్ట్‌ డోసు కింద 91,163 మందికి టీకా ఇవ్వగా, సెకండ్‌ డోసు 19,678 మందికి పంపిణీ చేశారు. ఇంకా రెండో డోసు 70 వేల మందికి ఇవ్వాల్సి ఉంది. కానీ వీరిలో వేలాదిమందికి గడువు ముగిసినా ఇంకా టీకా అందలేదు. ఈ రెండు టీకాలకు కలిపి 2,94,131 మందికి రెండో డోసు ఇవ్వాల్సి ఉండగా వీరిలో లక్ష మందికి గడువు దాటిపోయింది. కానీ రాష్ట్రంలో టీకాల కొరత తీవ్రంగా ఉండడంతో జిల్లాకు వ్యాక్సిన్లు రావడం లేదు. ఒకపక్క జనం వేలల్లో టీకా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వ్యాక్సిన్‌ కొరతను అధిగమించడానికి అని జిల్లా అధికారులు చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెండు రోజుల విధానం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ు.

Updated Date - 2021-05-14T07:02:51+05:30 IST