టీకాలు వేసుకోనందుకే Covid వ్యాప్తి

ABN , First Publish Date - 2022-06-10T14:24:25+05:30 IST

రాష్ట్రంలో ఒక్క డోస్‌ టీకా కూడా వేయించుకోనివారి వల్లే కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌

టీకాలు వేసుకోనందుకే Covid వ్యాప్తి

- ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ 

- 12న మళ్లీ మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 9: రాష్ట్రంలో ఒక్క డోస్‌ టీకా కూడా వేయించుకోనివారి వల్లే కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక రాయపురంలోని ప్రభు త్వ స్టాన్లీ ఆస్పత్రిలో కాలేయం వ్యాధి నివారణపై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ..  దేశంలో మళ్లీ రూపాంతరం చెందిన ఒమైక్రాన్‌ వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు గతంలోలాగే భౌతికదూరం పాటించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కరోనా నిబంధనల సడలింపు కారణంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 40 శాతం పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయన్నారు. కాగా రాష్ట్రంలో ఏప్రిల్‌లో తక్కువగా వున్న వైరస్‌ వ్యాప్తి.. ప్రస్తుతం గణనీయంగా పెరుగుతోందన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ కరోనాను సంపూర్ణంగా నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దక్షిణాఫ్రికాలో బీఏ4, బీఏ5 కొత్తరకం వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని, దీనిని 5వ అలగా నిపుణులు నిర్ధారించారని తెలిపారు. వరుసగా మూడు రోజుల పాటు జ్వరం, జబ్బు, దగ్గు వంటి లక్షణాలున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవడంలో తప్పులేదని, ఎవరికైనా పాజిటివ్‌గా తేలినా భయపడాల్సిన పని లేదన్నారు. పాజిటివ్‌గా తేలిన వారి కోసం ప్రభుత్వాస్పత్రుల్లో పడకలు అందుబాటులో వున్నాయన్నారు. ఆస్పత్రికి వెళ్లడానికి ఇష్టపడని వారు ఇళ్లలోనే క్వారంటైన్‌ విధించుకుని, మందులు తీసుకోవచ్చన్నారు. కరోనాను పూర్తిస్థాయిలో నివారించాలన్న ఉద్దేశంతో ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నామని తెలిపారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-06-10T14:24:25+05:30 IST