బీహార్ ఎన్నికల ప్రచారంలో నేతలకు కరోనా ముప్పు

ABN , First Publish Date - 2020-10-23T13:46:29+05:30 IST

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్న నలుగురు సీనియర్ నాయకులకు కరోనా వైరస్ సోకడంతో....

బీహార్ ఎన్నికల ప్రచారంలో నేతలకు కరోనా ముప్పు

నలుగురు అగ్ర నాయకులకు  కరోనా పాజిటివ్...ప్రచారానికి ఆటంకం

పట్నా (బీహార్): బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్న నలుగురు సీనియర్ నాయకులకు కరోనా వైరస్ సోకడంతో ప్రచారానికి ఆటంకం కలిగింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, కేంద్ర మాజీ మంత్రులు షహనావాజ్ హుస్సేన్, రాజీవ్ ప్రతాప్ రూడీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నాలుగుసార్లు ముజఫర్పూర్ ఎమ్మెల్యే విజయేంద్ర చౌదరి కొవిడ్ బారిన పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు రాజకీయపార్టీల సీనియర్ నేతలు ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొనడం వల్ల వారికి కరోనా ముప్పు పొంచి ఉంది. కరోనా బారి నుంచి త్వరలో కోలుకొని పార్టీ ప్రచారంలో పాల్గొంటానని బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ చెప్పారు.


 బీజేపీ స్టార్ క్యాంపెయినరు అయిన షహనావాజ్ హుసేన్ కరోనా సోకి ఎయిమ్సు లో చేరారు. తాను కలిసిన వారికి కరోనా సోకడంతో తాను పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని, దీంతో ఎయిమ్సు లో చేరి చికిత్స చేయించుకుంటున్నానని హుసేన్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో థర్మల్ తనిఖీలు చేయడం, మాస్కులు  ధరించడం, సామాజిక దూరం పాటించాలని ఎన్నికల కమిషన్ కొవిడ్ మార్గదర్శకాలు విడుదల చేసినా ఎవరూ దాన్ని పాటించడం లేదు. ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్న నేతలకు కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.  బీహార్ ఎన్నికల సిబ్బంది కోసం ప్రభుత్వం 7 లక్షల హ్యాండ్ శానిటైజర్లు, 4.6 మిలియన్ల మాస్కులు, 6 లక్షల పీపీఈ కిట్లు, 7.6 లక్షల ఫేస్ షీల్డులు. 2.3 మిలియన్ల గ్లోజులను కొనుగోలు చేసింది. 

Updated Date - 2020-10-23T13:46:29+05:30 IST