Abn logo
Apr 23 2021 @ 01:05AM

ఫలితాలివ్వని పరీక్షలెందుకు?

ఐజీఎం స్టేడియంలో కరోనా పరీక్షలకోసం భారీగా క్యూలో వేచిఉన్న బాధితులు

రిపోర్టులు వచ్చేసరికి గాల్లో కలుస్తున్న ప్రాణాలు

వారాలు గడుస్తున్నా వెల్లడికాని పరీక్షల రిపోర్టులు 

24 గంటల్లో ఫలితాలంటున్న అధికారుల మాటలు నీటిమూటలే!

జిల్లాలో కొవిడ్‌ టెస్టుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారటంతో అష్టకష్టాలు పడి శాంపిల్స్‌ ఇచ్చినవారికి సకాలంలో రిపోర్టులు అందక బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. రిపోర్టులు ఆలస్యమవుతున్నకొద్దీ బాధితుల్లో వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత పెరిగి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతున్నారు. చివరి దశలో వచ్చిన రిపోర్టు పట్టుకుని ఆసుపత్రికి వెళ్లినా వ్యాధి ముదిరి కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలూ లేకపోలేదు. 

- విజయవాడ రామలింగేశ్వరనగర్‌కు చెందిన సురేష్‌కు జలుబు, జ్వరం వచ్చింది. కరోనా అనుమానంతో పరీక్ష చేయించుకున్నాడు. 24 గంటల్లో రావాల్సిన రిపోర్టు నాలుగు రోజుల తర్వాత వచ్చింది. అనుమానించి నట్టుగానే పాజిటివ్‌ వచ్చింది. రిపోర్టు కోసం ఎదురుచూస్తుండటంతో వైరస్‌ ముదిరిపోయింది. కుటుంబ సభ్యులకు కూడా సోకిందేమోనని భార్యాబిడ్డలకు పరీక్ష చేయించాడు. మరో ఐదు రోజుల తర్వాత భార్య రిపోర్టు మాత్రమే వచ్చింది. భయపడినట్టుగా భార్యకు కూడా పాజిటివ్‌. ఆమెకు దాదాపు 10రోజులకు పైగా ఎలాంటి వైద్యం లేదు. ఇక రిపోర్టులు రాని తమ కుమారుడికి పాజిటివో, నెగెటివో తెలియక నరకయాతన పడుతూ రిపోర్టు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

- కానూరుకు చెందిన ఒక కుటుంబంలో నలుగురు కరోనా అనుమానంతో శాంపిల్స్‌ ఇచ్చారు. రెండు రోజుల తర్వాత ఇద్దరికి పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. మరో ఇద్దరి రిపోర్టులు రాలేదు. వాటికోసం ఎదురుచూస్తుండగానే ఓ పెద్దాయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళితే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష రిపోర్టు తెస్తేగాని అడ్మిట్‌ చేసుకోమని స్పష్టం చేశారు. దీంతో వైద్యం అందక ఆ బాధితుడు మృత్యువుతో పోరాడుతూ నరకయాతన అనుభవిస్తున్నాడు.

- గొల్లపూడికి చెందిన మరో వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో పరీక్ష చేయించుకున్నాడు. మూడు రోజులు గడిచినా రిపోర్టు రాలేదు. ఆయనకు పాజిటివో, నెగెటివో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు రిపోర్టు పట్టుకుని వెళ్తే తప్ప ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డాక్టర్లు వైద్యం చేయమని చెబుతున్నారు. 

ఆంధ్రజ్యోతి-విజయవాడ : కొవిడ్‌ పరీక్షలకు శాంపిల్స్‌ సేకరించి 24గంటల్లో ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు చెబుతున్న మాటలు నీటిమూటవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ తరుణంలో ప్రజలకు విస్తృతంగా పరీక్షలు నిర్వహించి వెంటనే రిపోర్టులు వెల్లడించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కరోనా వైరస్‌ గతంకన్నా ఇప్పుడు చాలా వేగంగా విస్తరిస్తోందని వైద్యనిపుణులే చెబుతున్నారు. వ్యాధి తీవ్రత కూడా గతం కన్నా ఇప్పుడే మరింత ఎక్కువగా ఉందని, ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ చాలా తక్కువగా ఉండటంతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు.. కరోనా కట్టడికి విస్తృతంగా కొవిడ్‌ టెస్టులు నిర్వహించడం, మెరుగైన చికిత్స అందించడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితులు మండిపడుతున్నారు. 

గత ఏడాది జిల్లాలో కరోనా అలజడి మొదలైనప్పుడు జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించింది. ప్రజలకు సరైన సమయంలో టెస్టులు చేయటం, బాధితులకు మెరుగైన వైద్యసేవలకు చర్యలు చేపట్టడం, వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు, కొవిడ్‌ నిబంధనలు అమలు చేయడంలో విశేషంగా కృషి చేసి ప్రశంసలందుకున్నారు. గతంలో ఎక్కడైనా ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైతే ఆ ప్రాంతంలోని ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించేవారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, పట్టణాలు నగరాల్లో సీఎం ఆరోగ్య కేంద్రాలలోను ఈపరీక్షలు నిర్వహించేవారు. మరోవైపు ఎక్కడికక్కడ ప్రధాన కూడళ్లల్లో ప్రత్యేక కొవిడ్‌ బస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృతంగా పరీక్షలు నిర్వహించేవారు. అంతేకాకుండా 24 గంటల్లోనే రిపోర్టులు వెల్లడించేలా ల్యాబ్‌లలో అదనపు టెక్నీషియన్లను నియమించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కరోనా ప్రభావం తగ్గడంతో జిల్లా యంత్రాంగం కొవిడ్‌ టెస్టులకు తిలోదకాలిచ్చేసింది. ఆసుపత్రుల్లో బాధితులు కూడా తగ్గడంలో అదనంగా నియమించిన కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని విధుల నుంచి తప్పించేశారు. మళ్లీ నెల తిరక్కుండానే గత మార్చి మొదటి వారం నుంచి కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రాణాంతక వైరస్‌ జిల్లామొత్తాన్ని చుట్టేసింది. ప్రజలు భయంతో కొవిడ్‌ పరీక్షలకు పరుగులు తీస్తున్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాంపిల్స్‌ తీసుకునేవారే లేరు. ఇటీవల నిర్దేశిత ప్రాంతాల్లో శాంపిల్స్‌ తీసుకుంటున్నా వాటి రిపోర్టులు రావడానికి వారం, పది రోజులు పడుతోంది. ఈలోపు పుణ్యకాలం కాస్తా ముగిసిపోయి బాధితులు మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.దీంతో బాధితులు ఎక్కువగా  ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లకు వెళుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు నిర్వాహకులు రూ. వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి తెర తీశారు. ఆర్థికభారమైనా ప్రాణభయంతో కొందరు అప్పులు చేసి మరీ ప్రైవేట్‌ ల్యాబ్‌లలో యాంటీజెన్‌ పరీక్షలు చేయిం చుకుంటున్నారు. అక్కడ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన రిపోర్టులను తీసుకుని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తుంటే ఆ రిపోర్టులు పనికిరావని, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకుని రావాలని చెబుతున్నారు. దీంతో బాధితుల కథ మళ్లీ మొదటికొస్తోంది. ప్రాణభయంతో విలవిల్లాడిపోతున్న ప్రజల కష్టాలను చూసైనా జిల్లా ఉన్నతాధికారులు జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించడం, రిపోర్టులు కూడా వెంటనే వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Advertisement