Abn logo
Apr 20 2021 @ 11:44AM

కొవిడ్‌కు... ఈ పరీక్షలే ముఖ్యం!

ఆంధ్రజ్యోతి(20-04-2021)

కొవిడ్‌ - 19 నిర్థారణ, చికిత్సలకు సంబంధించి కీలకమైన పరీక్షలు బోలెడన్ని! వాటిని ఎవరికి, ఎప్పుడు, ఎందుకు చేస్తారు? మెరుగైన చికిత్సలో ఈ పరీక్షల పాత్ర ఏ మేరకు? 


కొవిడ్‌ నిర్థారణకు పరీక్షలు ఉన్నట్టే, కొవిడ్‌ చికిత్స నిర్థారణకూ పరీక్షలు ఉంటాయి. బాధితుల లక్షణాల తీవ్రత, వారి ఆరోగ్య పరిస్థితి, పూర్వపు ఆరోగ్య సమస్యల ఆధారంగా సమర్థమైన చికిత్స అందించడంలో ఈ నిర్థారణ పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయి. వాటి ప్రధాన లక్ష్యం ఊపిరితిత్తులే అయినా మూత్రపిండాలు, కాలేయం, గుండె... ఇలా ఇతరత్రా ప్రధాన అవయవాల మీద కూడా వైరస్‌ దాడి చేస్తుంది. మరీ ముఖ్యంగా అధిక రక్తపోటు మొదలు, మధుమేహం, గుండె, కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్న కొమార్బిడ్‌ కోవకు చెందిన వాళ్లకు సాధారణ కొవిడ్‌ పరీక్షలతో పాటు సమస్య కలిగిన అవయవాలకు సంబంధించిన ఇతర పరీక్షలు కూడా అవసరం అవుతాయి. 

వ్యాక్సిన్‌ కొవిడ్‌ను అడ్డుకోదు!

వ్యాక్సిన్‌ వేయించుకుంటే కొవిడ్‌ సోకదు అనేది అపోహ. వ్యాక్సిన్‌ రెండు డోసులు వేయించుకున్నా కొవిడ్‌ సోకే వీలుంది. వ్యాక్సిన్‌ కేవలం కొవిడ్‌ సోకిన తర్వాత, దాని తాలూకు తీవ్ర దుష్ప్రభావాలను మాత్రమే అడ్డుకోగలుగుతుంది. ఇన్‌ఫెక్షన్‌ ప్రాణాంతకంగా పరిణమించకుండా నియంత్రిస్తుంది. కాబట్టి వ్యాక్సిన్‌ వేయించుకున్నా కొవిడ్‌ రక్షణ చర్యలు పాటించడం తప్పనిసరి. స్వైన్‌ ఫ్లూ మాదిరిగానే కొత్త రూపం పోసుకునే వైర్‌సలకు తగ్గట్టుగా కొత్త కొవిడ్‌ వ్యాక్సిన్‌ను రూపొందించుకుంటూ కొనసాగవలసి ఉంటుంది. ఇందుకు సమయం పట్టవచ్చు. కాబట్టి అందరూ అప్రమత్తంగా నడుచుకోవాలి. 


ఇ.జి.ఎస్‌.ఆర్‌!

మూత్రపిండాలకు రక్తాన్ని చేరవేసే ప్రధాన రక్తనాళాల్లో  కొవిడ్‌ వైరస్‌ కారణంగా రక్తపు గడ్డలు ఏర్పడడంతో మూత్రపిండాలు ఫెయిల్‌ అయ్యే ప్రమాదం తలెత్తుతుంది. కాబట్టి వీరికి సీరం క్రియాటినిన్‌, సీరం ఎలక్ర్టొలైట్స్‌, బ్లడ్‌ యూరియా నైట్రోజన్‌ అనే పరీక్షలు చేయించవలసి ఉంటుంది. తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులు కలిగినవారికి ఇజిఎ్‌సఆర్‌ అనే మరో కీలక పరీక్ష కూడా అవసరం. ఈ పరీక్షతో మూత్రపిండాల పనితీరు, సామర్థ్యాల గురించి తెలుసుకోవచ్చు. ఫలితాన్ని బట్టి కొవిడ్‌ చికిత్సలో మార్పులు చేయవలసి ఉంటుంది. సాధారణంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి పూర్తి మోతాదు కొవిడ్‌ మందులు (యాంటీబయాటిక్స్‌, యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌) ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ పరీక్షల ఫలితాలను బట్టి కొవిడ్‌ మందుల మోతాదును సరిచేయవలసి ఉంటుంది. 

పిటి ఐఎన్‌ఆర్‌, డి డైమర్‌!

కొవిడ్‌ ప్రధాన గుణం రక్తం గడ్డ కట్టే తత్వాన్ని పెంచడం. గుండె సమస్యలతో ఉన్నవారు రక్తం పలుచనయ్యే మందులు వాడుతూ ఉంటారు. ఆ మందుల ప్రభావాన్ని అధిగమించి, రక్తాన్ని గడ్డ కట్టించే స్వభావం కొవిడ్‌కు ఉంటుంది. కాబట్టి రక్తం పలుచనయ్యే మందులతో పాటు అదనపు మందులు వీరికి ఇవ్వవలసి ఉంటుంది. హృద్రోగులు వాడుకునే బ్ల్లడ్‌ థిన్నర్స్‌లో కూడా రకాలు ఉన్నాయి. ఎకోస్ర్పిన్‌, క్లోపిట్యాబ్‌ అనే బ్లడ్‌ థిన్నర్స్‌ రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా తోడ్పడే సాధారణ మందులు. ఇవి కాకుండా గుండె వాల్వ్‌లో సమస్యలు ఉన్నవాళ్లు, అప్పటికే గుండె సర్జరీలు చేయించుకున్నవాళ్లు, ధమనులు, సిరలకు సంబంధించిన సర్జరీలు చేయించుకున్నవాళ్లు కొంత ఎక్కువ తీవ్రత కలిగిన బ్లడ్‌ థిన్నర్స్‌ వాడుతూ ఉంటారు. వీళ్లు వాడే వార్ఫరిన్‌, ఎపిక్సిడాన్‌ మొదలైన మాత్రలు రక్తాన్ని పూర్తిగా పలుచన చేసేస్తాయి. ఈ కోవకు చెందినవాళ్లకు పిటి ఐఎన్‌ఆర్‌ పరీక్ష చేయవలసి ఉంటుంది.


పిటి ఐఎన్‌ఆర్‌: ఈ పరీక్షతో రక్తం చిక్కదనం తెలుస్తుంది. కొవిడ్‌ బాధితుల్లో ఈ పరిస్థితిని తెలుసుకోవడం కోసం ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్‌ అనే ఐదు రకాల పరీక్షలు కూడా చేయవలసి ఉంటుంది. వీటిలో ఒకటి డిడైమర్‌. 


డి డైమర్‌: ఈ పరీక్షతో రక్తం గడ్డ కట్టే తత్వం ఎంత ఉందనేది తేలుతుంది. ఫలితం 500 లోపు ఉంటే నార్మల్‌గా, 500 అంతకంటే ఎక్కువ ఉంటే, కొవిడ్‌ ప్రభావం మొదలైందని గ్రహించి అందుకు తగిన చికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. ఫలితం 10 వేలు దాటితే ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న రక్తపు గడ్డలు ఏర్పడ్డాయని అర్థం చేసుకోవాలి. వీళ్లకు రక్తాన్ని పలుచన చేసే ఇంజెక్షన్లతో చికిత్స అవసరం అవుతుంది.


సిటి స్కాన్‌!

సిటిస్కాన్‌ ద్వారా ఊపిరితిత్తుల ఆకారం, వాటి మీద మరకలు తెలుస్తాయి. అయితే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలిపే లంగ్‌ ఫంక్షన్‌ పరీక్ష వల్ల అందుకు ఉపయోగించిన పరికరాల్లో వైరస్‌ చేరుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తుల సమస్యలు కలిగి ఉన్న కొవిడ్‌ బాధితులకు ప్రత్యామ్నాయంగా లక్షణాల ఆధారంగా చికిత్సను వైద్యులు అంచనా వేస్తారు. ఉబ్బసం ఉన్నవారికి కొవిడ్‌తో ఆస్తమా ఎటాక్‌, అలర్జీ ఉన్నవారికి దగ్గు తీవ్రత పెరగవచ్చు. ఇలాంటప్పుడు ఆయా సమస్యల మందుల మోతాదును పెంచి, కొవిడ్‌ చికిత్సతో జోడించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావలసి ఉంటుంది.


ప్లాస్మా మంత్రదండం కాదు!

కొవిడ్‌ ప్రాణహాని నుంచి గట్టెక్కాలంటే ప్లాస్మా చికిత్స తీసుకోవాలి అనుకుంటే పొరపాటు. నిజానికి ఎవరికైతే శరీరంలో చికిత్సతో యాంటీబాడీ రెస్పాన్స్‌ మొదలవదో, వారికి ప్లాస్మా అవసరం పడుతుంది. సార్క్‌ కొవి2 ఐజిజి విలువ ఒకటి కంటే తక్కువ ఉన్నవారికి మాత్రమే ప్లాస్మా అవసరం అవుతుంది. కొంతమందికి ఆ వ్యాల్యూ 2 లేదా 3 ఉన్నా, బాధితుడి పరిస్థితిని బట్టి ప్లాస్మా తీసుకునే సందర్భాలూ ఉంటాయి. వీరికి ప్లాస్మా 2 నుంచి 3ు మేరకే ఉపయోగపడుతుంది. అంతే తప్ప మంత్రదండంతో అద్భుతం జరిగిన చందంగా, ప్లాస్మా ఇచ్చిన వెంటనే రోగి కోలుకునే పరిస్థితి ఉండదు. ప్లాస్మా కేవలం కొంతమేరకు మాత్రమే పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అయితే వెంటిలేటర్‌ మీద ప్రాణాలతో పోరాడే బాధితుడికి ప్లాస్మాతో పొందే 2ు సహాయం ఎంతో కీలకం. కాబట్టి ప్రాణాపాయ పరిస్థితుల్లో, చివరి ప్రయత్నంగా  ప్లాస్మా చికిత్స అందించడం జరుగుతూ ఉంటుంది. 


కొవిడ్‌ వచ్చి తగ్గిన సందర్భాల్లో...

సిబిపి, సిటి స్కాన్‌: కొవిడ్‌ వచ్చి తగ్గిన తర్వాత రెండోసారి కొవిడ్‌ సోకిన సందర్భాల్లో, లక్షణాలు లేనివారికి ఎటువంటి పరీక్షలూ అవసరం లేదు. అయితే కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో కొంతమందికి మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు కొనసాగుతూ ఉండవచ్చు. మరికొంతమందికి బ్యాక్టీరియల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా పదే పదే తలెత్తుతూ ఉండవచ్చు. వీరి విషయంలో సిబిపి, సిటి స్కాన్‌ పరీక్షలు అవసరం అవుతాయి. కొందరికి ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో పెద్ద పెద్ద రక్తపు గడ్డలు ఏర్పడతాయి. పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అనే ఈ సమస్య ఏర్పడకుండా కొవిడ్‌ నుంచి కోలుకున్న మూడు నెలల వరకూ బ్లడ్‌ థిన్నర్స్‌ వాడవలసి ఉంటుంది. 


షుగర్‌ టెస్ట్‌: కొవిడ్‌ బాధితుల్లో ముందు నుంచీ బార్డర్‌లో ఉన్న మధుమేహం కొవిడ్‌ సమయంలో బయటపడవచ్చు. కొవిడ్‌ వైరస్‌ సోకడం వల్ల లేదా కొవిడ్‌ మందుల కారణంగా కూడా షుగర్‌ పెరగవచ్చు. ఈ మూడింట్లో అసలు కారణాన్ని కనిపెట్టి షుగర్‌ మందుల వాడకం విషయంలో వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. ఇందుకోసం షుగర్‌ టెస్ట్‌ తోడ్పడుతుంది.


బ్రెయిన్‌ స్కాన్‌: బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై పక్షవాతం వచ్చిన కొవిడ్‌ బాధితులు కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా క్రమం తప్పకుండా బ్రెయిన్‌ స్కాన్‌ చేయించుకోవలసి ఉంటుంది.


ఎల్‌.ఎ‌ఫ్.టి!

ఎల్‌ఎ‌ఫ్టి: కాలేయ సమస్యలు ఉన్నవారికి కొవిడ్‌ సోకినప్పుడు తప్పనిసరిగా లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ చేయవలసి ఉంటుంది. కొవిడ్‌ సోకినప్పుడు యాంటీవైరల్‌ మందులు వాడడం తప్పనిసరి. ఎలాంటి మందులు జీర్ణం కావాలన్నా, ఆ పని కాలేయం గుండానే జరగాలి. కాబట్టి మందుల ప్రభావం కాలేయం మీద ఎక్కువ. ఆ క్రమంలో కాలేయం నుంచి స్రావాలు విడుదల అవుతాయి. కాబట్టి చికిత్సలో భాగంగా వాడే మందులు కాలేయం మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తున్నాయనేది తెలుసుకోవడం కోసం ఈ పరీక్ష చేయడం తప్పనిసరి. ఫలితాన్ని బట్టి కొవిడ్‌ మందుల మోతాదును తగ్గిస్తూ, పెంచుతూ చికిత్సను కొనసాగిస్తారు.


రెండోసారి కొవిడ్‌ సోకితే?  

మొదటిసారి కొవిడ్‌ సోకిన సమయంలో చేసిన పరీక్షలే (ఆర్‌టి పిసిఆర్‌, సిటి చెస్ట్‌, సిబిపి, కిడ్నీ, లివర్‌ పరీక్షలు), ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లు (సిఆర్‌టి, డి డైమర్‌, ఫెరిటిన్‌, ఐఎల్‌6, ఎల్‌డిహెచ్‌) రెండవసారీ చేయవలసి ఉంటుంది. లక్షణాల తీవ్రతను బట్టి మరిన్ని కీలక పరీక్షలు కూడా అవసరం పడవచ్చు.


కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు ఇవే!

ఆర్‌టి పిసిఆర్‌: కొవిడ్‌ సోకిందనే అనుమానం వచ్చినప్పుడు చేసే మొట్టమొదటి పరీక్ష ఇది. 

సిటి స్కాన్‌: లక్షణాలు తీవ్రంగా ఉంటే, ఊపిరితిత్తులను వైరస్‌ ఎంతగా దెబ్బతీసిందో తెలుసుకోవడం కోసం ఈ పరీక్ష అవసరం.

సార్స్‌ కొవి2 ఐజిజి, ఐజిమ్‌: కొందరిలో కొవిడ్‌ నెగటివ్‌ ఫలితం వచ్చి, స్కాన్‌లో ఊపిరితిత్తుల మీద మరకలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు సోకిన ఇన్‌ఫెక్షన్‌ కొవిడ్‌కు సంబంధించినదా, కాదా అనేది తేల్చుకోవలసి ఉంటుంది. ఇందుకోసం యాంటీబాడీ పరీక్ష తోడ్పడుతుంది. ఈ పరీక్షలో ఐజిఎమ్‌గా ఫలితం వస్తే, తాజాగా కొవిడ్‌ సోకినట్టు, ఐజిజి ఫలితం వస్తే అప్పటికే శరీర రోగనిరోధకశక్తి వ్యాధితో పోరాడడం మొదలుపెట్టిందని అర్థం చేసుకోవాలి. 


ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లు!

కరోనా వైరస్‌ శరీరంలో తుఫాను వేగంతో సంచరిస్తూ విధ్వంసం సృష్టిస్తుంది. మార్గంలో అడ్డొచ్చిన అవయవాలను ధ్వంసం చేసుకుంటూ వెళ్తుంది. ఆ డ్యామేజీ నుంచి కోలుకోవడం కోసం కొంతమందికి ఆక్సిజన్‌ అవసరం పడితే, మరికొందరికి వెంటిలేటర్‌ అవసరం పడవచ్చు. అయితే శరీరంలో ఆ తీవ్రత ఎంత ఉందనేది ఇన్‌ఫ్లమేషన్‌ మార్కర్‌ పరీక్షలతో తెలుసుకోవచ్చు. కొవిడ్‌ లక్షణాలు తీవ్రంగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పరీక్షలు తప్పనిసరి. ఈ పరీక్షలు ఇన్‌ఫెక్షన్‌ ప్రారంభంలోనే కాకుండా చికిత్సలో భాగంగా, తీవ్రతను బట్టి ప్రతి మూడు లేదా ఐదు రోజులకు వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేవరకూ చేయవలసి ఉంటుంది. రోగి చికిత్సకు స్పందిస్తున్నదీ, లేనిదీ తెలుసుకోవడం కోసం కూడా ఈ పరీక్షలు తోడ్పడతాయి.


సి రియాక్టివ్‌ ప్రొటీన్‌: ఈ పరీక్ష శరీరంలో డ్యామేజీ తీవ్రతను తెలుపుతుంది.

డి డైమర్‌: లక్షణాలు తీవ్రంగా ఉంటే ఈ పరీక్ష చేయవలసి ఉంటుంది. ఈ పరీక్షతో రక్తంలో గడ్డలు ఏర్పడే తత్వాన్ని కనిపెట్టవచ్చు.

ఐఎల్‌ 6: ఇంటర్‌ల్యూకిన్‌ 6 అనే ఈ పరీక్షతో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ ఎంత తీవ్రంగా ఉందనేది తెలుస్తుంది.

ఎల్‌డిహెచ్‌, ఫెరిటిన్‌: ఇవి ఇండైరెక్ట్‌ మార్కర్లు. బాధితుడి స్థితి దిగజారే వీలుందా? చికిత్సకు బాధితుడు తట్టుకుని, కోలుకోగలడా?   అనే విషయాలు ఈ పరీక్షలతో తెలుస్తాయి.

డాక్టర్‌. వై. గోపీకృష్ణ, 

సీనియర్‌ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.