కరోనా కలవరం

ABN , First Publish Date - 2021-04-21T06:22:40+05:30 IST

జిల్లాలో కరోనా కలవరం తగ్గడం లేదు. ఐదోరోజూ వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అంటే.. సోమ, మంగళవారాల నడుమ 24 గంటల్లో 1063 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైరస్‌ కారణంగా ఐదుగురు మృతిచెందారు.

కరోనా కలవరం

ఐదో రోజూ వెయ్యి దాటిన కేసులు 

 ఐదుగురు మృత్యువాత 

మృతుల్లో ఉద్యోగులు 

తిరుపతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కలవరం తగ్గడం లేదు. ఐదోరోజూ వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అంటే.. సోమ, మంగళవారాల నడుమ 24 గంటల్లో 1063 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైరస్‌ కారణంగా ఐదుగురు మృతిచెందారు. దీంతో కరోనా కేసులు మొత్తం 102499కి, మరణాల సంఖ్య 927కు చేరాయి. అదే సమయంలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా 9023కు చేరింది. తాజా కొవిడ్‌ మరణాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉండటం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపుతోంది. తిరుపతిలో టీటీడీకి చెందిన ఎస్వీ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వై.రత్నరాజు కరోనా బారిన పడి మంగళవారం సాయంత్రం మరణించారు. నగరిలో విద్యుత్‌ శాఖ కార్యాలయ ఉద్యోగి ఒకరు సోమవారం రాత్రి మృతిచెందగా.. పూతలపట్టు మండలం రంగంపేటలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒకరు, పలమనేరులో ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని మృతి చెందారు. నగరి విద్యుత్‌ శాఖ కార్యాలయంలోనే మరో ఇద్దరు, నాగలాపురం విద్యుత్‌ రెవిన్యూ కార్యాలయంలో ఒకరికి వైరస్‌ సోకడంతో ఆ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటోంది. 

మిట్టపల్లెలో ప్రైమరీ కాంటాక్టులపై ఫిర్యాదు

సోమల మండలం మిట్టపల్లెలో నాలుగు రోజుల కిందట పది మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. గ్రామంలో వారి ప్రైమరీ కాంటాక్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందరికీ టెస్టులు చేయించేందుకు కందూరు పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పలుసార్లు గ్రామానికి వెళ్ళినా సహకరించలేదని సమాచారం. మరోవైపు ఇష్టానుసారం బయట ఊళ్లకు తిరుగుతుండడంతో మరింత మందికి వైరస్‌ సోకే ప్రమాదం నెలకొంది. దీంతో వీరిపై వైద్య సిబ్బంది సోమల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీటీడీ కీలక నిర్ణయాలు

కొవిడ్‌ నియంత్రణ పరంగా గతేడాది విలువైన సేవలందించిన టీటీడీ.. తాజాగా మళ్లీ చొరవ చూపింది. వచ్చేనెల ఆన్‌లైన్‌ రూ.300 దర్శన టికెట్ల కోటాను రోజువారీ 25 వేల నుంచీ 15 వేలకు తగ్గించింది. టీటీడీ పరిపాలనా భవనంలో మంగళవారం కలెక్టర్‌ హరినారాయణన్‌, వైద్యారోగ్య, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల అధికారులతో ఈవో జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు. స్విమ్స్‌ ఆస్పత్రిలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని, జిల్లా యంత్రాంగంతో సమన్వయం ఉండేలా జిల్లా అధికారిని కో ఆర్డినేటర్‌ లేదా నోడల్‌ అధికారిగా నియమించాలని కలెక్టర్‌ను కోరారు. స్విమ్స్‌లో పడకల సంఖ్య పెంచేందుకు, అవసరమైన పరికరాల కొనుగోళ్లకు అనుమతించారు. ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిలోని పడకలన్నింటినీ కొవిడ్‌ బాధితులకు కేటాయించాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగుల కోసం మాధవం వసతి సముదాయాన్ని కేటాయించారు. ఇతర కొవిడ్‌ బాధితుల కోసం పద్మావతి నిలయం, శ్రీనివాసం, విష్ణునివాసంతో పాటు రైల్వే స్టేషన్‌ వెనుకనున్న 2, 3వ సత్రాలను కలెక్టర్‌ అఽధీనంలో ఉంచాలని నిర్ణయించారు. వీటిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా వినియోగించుకునేందుకు అంగీకరించింది. ఈ కొవిడ్‌ కేర్‌ సెంటర్లతో పాటు కొవిడ్‌ ఆస్పత్రుల్లో బాధితులకు భోజనం కూడా గతంలోలాగే అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.  

కాణిపాకంలోనూ మొదలైన చర్యలు

కాణిపాక వినాయకస్వామి ఆలయంలోనూ కొవిడ్‌ నియంత్రణ చర్యలు మొదలయ్యాయి. స్వామి వారి దర్శన వేళల్లో మార్పులు చేస్తూ ఆలయ ఈవో వెంకటేశు నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో క్యూలైన్లను మూడు గంటలకోసారి శానిటైజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

తాజా కేసులు ఎక్కడెక్కడంటే.. 

జిల్లాలో తాజాగా గుర్తించిన 1063 కేసులు.. తిరుపతిలో 273, తిరుపతి రూరల్‌లో 162, శ్రీకాళహస్తిలో 88, చిత్తూరులో 50, మదనపల్లెలో 44, పీలేరులో 43, రేణిగుంటలో 37, రామచంద్రాపురంలో 28, వడమాలపేటలో 19, పుత్తూరులో 18, చంద్రగిరిలో 17, ఏర్పేడులో 16, నగరిలో 14, కలికిరి, రొంపిచెర్ల మండలాల్లో 13 చొప్పున, పాకాల, రామసముద్రం మండలాల్లో 12 వంతున, పలమనేరులో 11, కుప్పం, పెద్దపంజాణి మండలాల్లో 9 వంతున, చిన్నగొట్టిగల్లు, చౌడేపల్లె, గుడుపల్లె, గుర్రంకొండ, కేవీపల్లె, పెనుమూరు, పుంగనూరు మండలాల్లో 8 చొప్పున, బీఎన్‌ కండ్రిగ, విజయపురం మండలాల్లో 7 వంతున, కేవీబీపురం, కురబలకోట, తొట్టంబేడు మండలాల్లో 6 వంతున, గంగవరం, కలకడ, పూతలపట్టు, శాంతిపురం, తంబళ్ళపల్లె, వాల్మీకిపురం మండలాల్లో 5 వంతున, బి.కొత్తకోట, బంగారుపాళ్యం, సత్యవేడు, సోమల, వి.కోట మండలాల్లో 4 చొప్పున, బైరెడ్డిపల్లె, గుడిపాల, ములకలచెరువు, పీటీఎం, పెద్దమండ్యం, పిచ్చాటూరు, పులిచెర్ల, వెదురుకుప్పం, ఎర్రావారిపాలెం మండలాల్లో 3 చొప్పున, ఐరాల, యాదమరి మండలాల్లో 2 వంతున, జీడీనెల్లూరు, నారాయణవనం, సదుం, శ్రీరంగరాజపురం, తవణంపల్లె, వరదయ్యపాళెం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.


కొవిడ్‌ సెంటర్లలో 320 పడకల ఖాళీ 


తిరుపతిలో ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో మంగళవారం రాత్రి 9 గంటల వరకు 320 పడకలు ఖాళీగా ఉన్నాయి. పద్మావతి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 1000 బెడ్లుంటే అన్నీ ఫుల్‌ అయ్యాయి. విష్ణు నివాసంలో 800 బెడ్లు ఉండగా, అన్నీ నిండిపోయాయి. రుయాలో 876 బెడ్లుంటే అందులో 441 ఆక్సిజన్‌ బెడ్స్‌, 135 వెంటిలేటర్‌ ఐసీయూ బెడ్స్‌, 200 నాన్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. వీటిల్లో 100 నాన్‌ ఆక్సిజన్‌వి, 220 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.

Updated Date - 2021-04-21T06:22:40+05:30 IST