యూరప్‌ వెన్నులో వణుకు.. భీకరంగా కరోనా రెండో దశ

ABN , First Publish Date - 2020-11-01T09:30:38+05:30 IST

టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభన! పారిస్‌వాసులు చవి చూసిన నరకమిది!! ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్‌ అమల్లోకి

యూరప్‌ వెన్నులో వణుకు.. భీకరంగా కరోనా రెండో దశ

  • స్పెయిన్‌లో వైరస్‌ కొత్త రూపం
  • ఒక్క రోజులో 2.5 లక్షల కేసులు
  • ఇంగ్లండ్‌లో మళ్లీ లాక్‌డౌన్‌!
  • అమెరికాలోనూ విజృంభణ

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభన! పారిస్‌వాసులు చవి చూసిన నరకమిది!!  ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో జనమంతా స్వస్థలాలకు బయల్దేరారు.  వేల సంఖ్యలో వాహనాలన్నీ రోడ్లపైకి రావడంతో పారిస్‌ చుట్టుపక్కల 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 


లండన్‌, అక్టోబరు 31: ముప్పు తప్పిందని ఊరట పొందినంతలోపే యూర్‌పను కరోనా మళ్లీ వణికిస్తోంది. మొదటి దశ కంటే భీకరంగా కొవిడ్‌ రెండో దశ విరుచుకుపడుతోంది. గురువారం ఒక్క రోజే 2.5 లక్షల మంది వైరస్‌ బారినపడటమే దీనికి నిదర్శనం. తొలి దశ తీవ్రంగా ఉన్న రోజుల్లో (మార్చి, ఏప్రిల్‌, మే నెలలు)నూ ఈ స్థాయిలో పాజిటివ్‌లు రాలేదు. అప్పట్లో రోజువారీ మొత్తం యూరప్‌ కేసులు 35 వేలకు మించలేదు. ప్రస్తుతం దాదాపు పది రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దీనికి భిన్న కారణాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. నిపుణులు మాత్రం రెండు ప్రధాన కారణాలను పేర్కొంటున్నారు. ఒకటి.. వేసవిలో కరోనా కేసులు తగ్గడంతో ప్రజలు జాగ్రత్త చర్యలను విస్మరించి విస్తృతంగా ప్రయాణాలు చేయడం. రెండు.. ప్రస్తుత శీతాకాలంలో ఎక్కువగా ఇళ్లకే పరిమితం కావడం. చిన్నవైన, వెలుతురు సరిగా లేని ఇలాంటి ఇళ్లలో ఒకరికి వైరస్‌ సోకినా.. మిగతావారికి వ్యాపిస్తూ కేసులు పెరుగుతున్నాయి. వైరస్‌ తాజా విజృంభణ నేపథ్యంలో రోగులు, మరణాలు పెరుగుతుండటంతో బ్రిటన్‌ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని ఆలోచిస్తోంది.


యూర్‌పలో ప్రస్తుతం ఉన్నది కొత్త రూపు సంతరించుకున్న కరోనా (20ఏ.ఈయూ1)గా నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనిని స్పెయిన్‌లో జూలై నెలలోనే గుర్తించారు. ఆ దేశాన్ని సందర్శించిన లక్షలాది మంది ప్రజల ద్వారా యూరప్‌ అంతటా వ్యాపించిందని పేర్కొంటున్నారు. కాగా, యూర్‌పతో పోలిస్తే అమెరికా కథ భిన్నంగా ఉంది. అగ్ర రాజ్యంలో కరోనా రెండో దశ ప్రారంభమైందా? లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే.. అమెరికాలో జూన్‌ నుంచి రోజుకు 30వేల పైగా కేసులొస్తున్నాయి. ఆగస్గు,సెప్టెంబరులో 50-60 వేల మధ్య నమోదయ్యాయి. ప్రస్తుతం మాత్రం 90వేల పైగా పాజిటివ్‌లు రికార్డవుతున్నాయి. 


భారత్‌లో సంగతేంటో?

యూరప్‌ దేశాల సంగతి అలా ఉంటే.. శీతాకాలం, పండుగల నేపథ్యంలో భారత్‌లో కరోనా రెండో దశ సంగతేంటనే చర్చ సాగుతోంది. దేశంలో సెప్టెంబరు 16వ తేదీన 98 వేల గరిష్ఠ కేసులు వచ్చాయి. ప్రస్తుతం 50 వేలలోపునకు పడిపోయాయి. అయితే, కేరళ, ఢిల్లీల్లో పాజిటివ్‌లు పెరుగుతున్నాయి. రెండుసార్లు కేసులు పెరిగి, తగ్గిన ఢిల్లీలో ఏకంగా మూడో దశ నడుస్తోంది. కాగా, తీవ్ర వాయు కాలుష్యం, పండుగల రద్దీ కారణంగా ముప్పు మాత్రం పొంచి ఉందని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. దసరా, బిహార్‌ ఎన్నికలు కరోనా కేసుల పెరుగుదలకు ఏవిధంగా కారణమయ్యాయనేది కొన్ని వారాల తర్వాత తేలుతుందని పేర్కొంటున్నారు. కాగా, కేంద్ర కార్మికమంత్రి సంతోష్‌ గంగ్వార్‌ కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. ఆయన భార్య సహా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2020-11-01T09:30:38+05:30 IST