మరింత వేగంగా Covid ఉధృతి

ABN , First Publish Date - 2022-01-19T18:31:12+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి మరింత వేగంగా పెరుగుతోంది. ఒక వైపు నివారణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుండడంతో యంత్రాంగంలో ఆందోళన నెలకొంది. రాజధాని బెంగళూరులో గత రెండు రోజులుగా

మరింత వేగంగా Covid ఉధృతి

- రాజధాని నగరంలో కేసుల కలకలం

- తాజా స్థితిగతులు, వ్యాక్సిన్ల ప్రగతిపై CM సమీక్ష

- వారాంతపు కర్ఫ్యూ, నైట్‌ కర్ఫ్యూ కొనసాగింపుపై చర్చ

- హోం ఐసొలేషన్‌ అవధి వారానికి కుదింపు 


బెంగళూరు: రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి మరింత వేగంగా పెరుగుతోంది. ఒక వైపు నివారణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుండడంతో యంత్రాంగంలో ఆందోళన నెలకొంది. రాజధాని బెంగళూరులో గత రెండు రోజులుగా కాస్త తగ్గినట్టు అనిపించిన కొవిడ్‌ కేసులు మంగళవారం అమాంతం పెరగడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మంగళవారం సాయంత్రం 18 జిల్లాల అధికారులు, జడ్పీ సీఈఓలు, ఆరోగ్యశాఖ అధికారులు, ఎస్పీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వర్చువల్‌ రూపంలో రెండుగంటలకుపైగా రాజధాని బెంగళూరుతోపాటు పలు జిల్లాల్లో కరోనా వైరస్‌ స్థితిగతులపై సమీక్ష జరిపారు. వ్యాక్సిన్‌ ప్రక్రియపై కూడా ఆరా తీశారు. వారాంతపు కర్ఫ్యూ, నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలా వద్దా... అనే అంశంపై అధికారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో బెంగళూరు నగర, గ్రామీణ, కలబుర్గి, కొప్పళ, రాయచూరు, యాదగిరి, బళ్లారి, తుమకూరు, బీదర్‌, చిత్రదుర్గ, కోలారు, విజయపుర, మైసూరు, బెళగావి, దక్షిణకన్నడ, ధార్వాడ, హావేరికి చెందిన ఉన్నతాధికారులంతా పాల్గొని పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. 


హోం ఐసొలేషన్‌ అవధి వారానికి కుదింపు 

కొవిడ్‌ వైరస్‌ బారినపడ్డవారు హోం ఐసొలేషన్‌లో ఉండేందుకు వారం రోజులపాటు మాత్రమే అనుమతిస్తారు. ఈ విషయాన్ని బీబీఎంపీ చీఫ్‌ కమిషనర్‌ గౌరవ్‌గుప్త బెంగళూరులో మంగళవారం మీడియాకు తెలిపారు. బెంగళూరులో కరోనా వైరస్‌ బారినపడిన బాధితులు హోం ఐసొలేషన్‌లో చికిత్సలు పొందుతున్నారని, వీరిలో నెగటివ్‌ రిపోర్టు వచ్చినవారు మినహా మిగిలినవారు వారం తర్వాత అవసరమైతే ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుందన్నారు. తొలుత పదిరోజుల పాటు హోం ఐసొలేషన్‌లో చికిత్సకు అనుమతి ఇచ్చామని అయితే చాలామంది ఔషధాలను సక్రమంగా వినియోగించడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. రోగుల ను అప్రమత్తం చేసేందుకు అవధిని కుదించాల్సి వచ్చిందన్నారు. బెంగళూరు నగర వ్యాప్తంగా మొత్తం 28 శాసనసభ నియోజకవర్గాల్లోనూ స్టాప్‌ వన్‌ అనే సంస్థ సహకారంతో హోం ఐసొలేషన్‌లో ఉంటున్న కొవిడ్‌ బాధితుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2022-01-19T18:31:12+05:30 IST